Monday, March 28, 2011

Wednesday, March 2, 2011

రాం గోపాల వర్మకి జేజేలు!

నేను ఆయన అభిమానిని కాదు. శివ, క్షణక్షణం, రంగీలా తరువాత రణ్, రక్తచరిత్ర 1 మినహా ఆయన యితర సినిమాలు నేను చూడలేదు. అందరూ అంతగా మెచ్చుకున్న ఆయన సినిమాలు - కంపెనీ, సత్యా - కూడా చూడలేదు. ఆయన చూసి, పరవశించి అందర్నీ చూడమని చెప్పిన 'అవతార్' కూడా చూడలేదు. ఆయన తెలంగాణ రాష్ర ఉద్యమ నేపథ్యంలో తన బ్లాగ్ లోనూ, తరువాత ఆంధ్రజ్యోతి లోను లగడపాటి రాజగోపాల్ని సమర్ధిస్తున్నట్లు వ్రాసిన వ్యాసాన్ని చూసి ఆయన్ని - నావికుల భాషలో - తిట్టుకున్నాను కూడా.

ఎంతో కొంత సృజనాత్మకత ఉండి, సినిమా రూపం పట్ల అవగాహన వున్న దక్షణ భారత దర్శకులు మెదట తెలుగు/తమిళ్, తరువాతి మెట్టు హిందీ, ఆ తరువాత హాలీవుడ్డో లేక ఆస్కారో అని వెంపర్లాడుతూ వెగటు పుట్టిస్తున్న వేషాలు వేస్తున్న రోజుల్లో, ఆ సూడో మేధావుల వేష భాషల్ని అనుసరించక, ఆ స్పృహే లేనట్లు, ఒక పేట రౌడి వేషంలో తిరుగుతూ, బతుకుతూ, సినిమాలు తీస్తూ, మర్యాదస్తుడిగా గుర్తించబడడానికి నిరాకరిస్తున్న రాం గోపాల్ వర్మ, గెలిచినా ఓడినా ఒక యోధుడి - హీరో - వలె నాకు గోచరిస్తున్నారు.

'నా ఇష్టం' కొద్ది సినిమాలు తీస్తాను అంటున్నాడంటే అతనికి ప్రేక్షకుల మీద ఎంత గౌరవం, నమ్మకం వుండి వుండాలి? ఒక సృష్టికర్త నా యిష్టం ఇలాగే చేస్తాను అన్నారంటే, నన్ను ఆదరించగలిగే ప్రేక్షకులు / శ్రోతలు ఈ కాలంలో, ఈ దేశంలో వుండే వుంటారు. వాళ్ళు వస్తారు. చూస్తారు. వాళ్ళకోసమే నేను రోజు నిద్రలేచి పనిచేసేది అంటున్నారని నాకు వినిపిస్తుంది. అటువంటి ఉన్మాదమే, ఆధారంలేని నమ్మకమే వారిచేత ప్రయోగాలు చేయిస్తుంది. రిస్క్ తీసుకునేలా చేయిస్తుంది. ఈ సందర్భంలో అసందర్భంగా నేను ఆరాధించే తెలుగు సినిమా దర్ళకుడు బి.ఎన్. రెడ్డి నాకు జ్ఞాపకం వస్తారు. ఆయన నాయిష్టం అనుకుని తీసిన సినిమాలు 'బంగారుపాప', 'మల్లీశ్వరి' వంటివి ఈరోజుకి చూసి, పరవశించే ప్రేక్షకులు వున్నారు. కానీ ఆయన బాక్సాఫీస్ విజయం కోసం ఒత్తిడులకో ప్రలోభాలకో లొంగి తీసిన 'రాజమకుటం' అప్పుడూ ఇప్పడూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

కూడికలు తీసివేతలు తప్ప మతిలేని ఈ ప్రపంచంలో మన అదృష్టం కొద్ది మిగిలిన కొద్ది మంది మతిలేని వ్యక్తులవలే కనిపిస్తున్నారు రాం గోంపాలవర్మ. అటువంటి వ్యక్తులు love me or leave me అని తప్ప మరో ఎంపిక మనకి మిగల్చరు. వాళ్ళని ignore చేయడం చాలాకష్టం. ప్రేమించగలగడం దాదాపు అసాధ్యం.

Now, I choose to - try to - love RGV.