Saturday, April 16, 2011

తల్లికో బహుమతి

తమిళం: పి.ఎన్. సత్యమోహన్
అనువాదం: శివారెడ్డి
ప్రచురణ : నవ్య ఏప్రిల్ 13, 2011ఇంతకు ముందు అది నాకు తట్టలేదు
చెంపల దగ్గర తెల్లబడుతున్న ముప్ఫయ్యారేళ్ళ వయసులో
నాకు రెండింతల వయసుండి
వృద్ధాశ్రమంలో వుంటున్న మా అమ్మకి
ఓ బహుమతి కొనివ్వాలని ఇప్పుడు తట్టింది
జుట్టు తెల్లబడుతున్న ముప్ఫయ్యారేళ్ళ వయసులో
మా అమ్మకో బహుమతి కొనివ్వాలని!

చక్కని ఉన్నిపరుపు పరిచిన
ఉయ్యాలెందుకు కాకూడదు
నన్ను తొమ్మిది నెలలు కడుపులో
ఉయ్యాలలూపి అన్నివేళలా
సౌకర్యాన్నిచ్చిన ఆమె గుర్తుకోసం
కృతజ్ఞతాపూర్వకంగా చక్కని ఉయ్యాలెందుకు కాకూడదు

నే వూదిన గాలితో నిండిన గాలిదిండెందుకు కాకుడదు
ఆమె మీద కాళ్ళేసి దిండులాగా
ఆమె పక్కలో పడుకున్న నా బాల్యం రోజులకు గుర్తుగా
నా అనంతప్రేమతో నిండిన
గాలిదిండెదుకు కాకూడదు

నా యౌవనంలో
నానాలుకకోరిన యాభైరకాల దిక్కుమాలిన వంటకాలనీ
చేతులు కాలింది పట్టించుకోకుండా వండిపెట్టిన మా అమ్మని
ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి
బ్రహ్మాండమైన భోజనం ఎందుకు పెట్టించకూడదు?

ఆ రోజులకు గుర్తుగా,
నాన్న ఆనారోగ్యంగా వున్నప్పుడు
కుటుంబం మొత్తం కుంగిపోతున్నప్పుడు
సంసారాన్ని నడపటానికి, ఎన్ని ఇళ్ళల్లోనో పనిమినిషిగా చేసి,
తను మందులు కొనుక్కోకుండా,
నాకు పుస్తకాలు కొనిపెట్టిన ఆ రోజులకు గుర్తుగా,
ధన్యవాదాల్తో ఒక వేయిపేజీల నవల రాసి,
అచ్చేసి ఆమెకెందుకివ్వగూడదు?

విధవరాలై వుండి కూడా నాకో వధువును చూసి పెళ్లిచేసి
మా మానాన మమ్మల్ని బతకనివ్వటానికి
వదిలిపెట్టిన మా అమ్మకి గుర్తుగా కృతజ్ఞతాపూర్వకంగా
మా ఆవిడతో కలిసి ఒక ఫోటో తీసి
ఆమెకెందుకు బహూకరించకూడదు?

నేనామెకెంతయినా చేయెచ్చు
నేనామెకెన్నయినా కొనివ్వచ్చు
నా యిచ్చవచ్చినన్ని బహుమానాల్తో
ఆమె నలంకరించవచ్చు కానీ, ఆమెకి కించిత్తు
అసంతృప్తి కలిగిస్తానేమో -
కూరలో కాస్తంత ఉప్పు ఎక్కువయినట్టు -
ఆమె ఏమన్నా అసంతృప్తి పడితే
అది నాకు హృదయశల్యం -
అందుకే ఆమె దగ్గరకి పరుగెత్తా -

అలసిన చూపులతో
వృద్ధపల్లకిలా గోడలో కలిసిపోయి,
అరవై డెబ్భయిమంది ముసలాళ్ళ మధ్య మా అమ్మ కూర్చోనుంది
ఆమె ఆకారం చెదిరినట్టు కనిపించింది.

ఆమె పాదాల కింద మట్టిని
నుదుటితో తాకుతూ సాష్టాంగదండ ప్రణామం చేసి
అడిగా 'అమ్మా! నీకేం కావాలో కోరుకో' అని
ఒకడు టెలిస్కోపుగుండా నక్షత్ర మండలాన్ని వీక్షించినట్టు
కనులు చిట్లించి నావంక చూస్తూ అంది
'చెంపలకి పైన, చెంపల దగ్గర
ఆ తెల్లటి పూలేవిటిరా?
ఆరిదేవుడా! కాస్త నల్లరంగు కొనుక్కొని
వేసుకోరా తండ్రీ!'

సతతం నాగుంచి ఆలోచించే
ఆరాటపడే గొప్ప హృదయముంది ఆమెకి
శాశ్వతంగా ఆమె నాకిచ్చే
గొప్ప బహుమతి ముందు
నేనిద్దామనుకున్న బహుమతులన్నీ
ముక్కచెక్కలయిపోయాయి!

No comments:

Post a Comment