Monday, September 29, 2008

గాంధీ పుట్టిన రోజు

ఈమధ్యే మిత్రుడు వంశీ హిందులో అచ్చయిన ‘Give Buddihst economics a try’ అనే వ్యాసం చదవమని పంపిచాడు. ఆ వ్యాసం రాసింది బోస్టన్లో సఫోల్క్ యూనివర్సిటీలో పనిచేసే ఆచార్య సి. గోపినాధ్. ఆధునిక అర్ధశాస్త్రంలో, వస్తు వినిమయమే సంతోష జీవితానికి సోపానం అన్న రీతిలో జరుగుతున్న వాదనలకి ప్రతిగా వినిమయ విలువలకన్నా భిన్నమైన విలువలని కనుగొనవలసిన అవసరం వుందని, అలాంటి ప్రత్నామ్నాయం బౌద్ధంలోనో ఇంకో తత్వశాస్త్రంలోనో వుంటే దానికి ఒక అవకాశం యివ్వాలనే అభిప్రాయం ఆ వ్యాసకర్త వ్యక్తంచేశారు. ‘ధర్మ’ వ్యతిరేకంకాని మార్కెట్లని సూచించేలా ‘ధర్మ ఇండెక్స్’ని త్వరలో డౌజోన్స్ ఇండక్స్ లో చేర్చబోతున్నారనీ ఆయన తెలిపారు.

ఈవాళ మనకి నగరాల్లో అభివృద్ధిపేరుతో దిగుమతి అవుతున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లు, ఐ-మేక్స్ లు, కారులు, పబ్ లు, స్టార్ హోటలాంటి కార్పరేట్ హాస్పటళ్ళు, ఆడంబరాలు అవసరాలయిపోతున్న మన జీవన విధానాలు ఇన్ని గందరగోళాల మధ్య మనం గాంధి పుట్టనరోజుని అర్ధవంతంగా జరుపుకోగలుగుతామా?

నేను అమెరికావెళ్ళిన కొత్తల్లో – 2002లో – ఒకసారి కొంతమంది సహోద్యోగులు, వి.పి.తో కలసి లంచ్ కి వెళ్ళినప్పుడు ఆయన గాంధీ ప్రస్తావనతెచ్చారు. నాతో వున్న యింకో భారతీయురాలు గాంధీపేరు వినగానే కోపంతో ‘ఆయన వల్లే మాదేశం యింత అధ్వాన్నంగా అయింది. ఒక చెంపమీద కొడితే యింకో చెంప చూపించమనడం అంత మూర్ఖత్వం యింకోటి లేదు’ అంది. ఆ తరవాత చర్చ ఎలా జరిగిందో నాకు సరిగ్గాగుర్తులేదు కానీ నేను అన్నది, స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల అనంతరంకూడా, అనేక రకాల జాతులు, భాషలు, విభేదాలు వున్న భారతదేశంలాంటి – దాదాపు ఖండం అనదగినంత – పెద్ద దేశం యింకా ముక్కలు కాకుండా ఒకేదేశంగా మిగిలివుందంటే ఆ ఖ్యాతి గాంధీదే అని. మిగతా దేశాల్లో జరిగిన హింసాయుతమైన జాతీయ వుద్యమాలు, సఫలం అయ్యాకా ఆ ఆయుధాలన్ని ఏమయ్యాయి? ఆయా దేశాలలో రక్తశిక్తమైన అంతర్గత పోరాటాలకి ఆ ఆయుధాలే ఉపయోగపడ్డాయి.

తొభైల్లో రష్యా అఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించింది, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆఫ్ఘన్లకి అమెరికా, యింకా కొన్నిదేశాలు ఆయుధాలు సరఫరాచేసాయి. రష్యాని యుద్ధంలో ఓడించారు. ఆ యద్ధంలో వాడిన ఆయుధాలూ, వాడగా మిగిలిన మందుగుండూ, ఆ యుద్ధాలకోసం అమెరికా ఆఫ్ఘన్లకి యిచ్చిన శిక్షణా, రష్యా ఓటమి తరువాత ఏమయ్యాయి? ఆఫ్ఘన్లు వాటిని ఎవరిమీద ఎందుకు వాడారో అందరకీ తెలిసిన విషయమే.

గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళమీద ద్వేషంతొ కాదు, ఆయన మనదేశంలో వున్న అశుభ్రతా, అవిద్య, ఆకలి, రోగాలు, అంటరానితనం మొదమైనవి మనదేశ ప్రగతికి - బ్రిటిష్ వారికంటే - తీవ్రమైన ప్రతికూల అంశాలుగా పరిగణించాడు. 1931లో గాంధీకీ వైస్రాయ్ ఇర్విన్ కి మధ్య చర్చలు జరిగి ఒప్పందం జరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్ర్వం రావడం - ఖచ్చితమైన తారీఖు తెలియదు కానీ ఆ రోజు త్వరలోనే రావడం - ఖాయం అన్న సంగతి గాంధీకి స్పష్టంగానే తెలుసు. అందుకే ఆయన పోరాటం / కృషి అంతా అసలైన విషయాలని ఆయన భావించిన వాటిమీద – దళిత సంస్కరణ, హిందూ ముస్లింల సఖ్యత, సత్యాగ్రహం గురించిన ప్రచారం, ఆరోగ్యకరమైన, ఆడంబరాలు లేని జీవన వైఖరి మీద ఆసక్తి కలిగించడం వంటి విషయాల మీద జరిగింది.

స్వాతంత్రం తరవాత భారత ఆర్దికరంగం మీద గాంధీ ప్రభావం చాలా తక్కువ. ఆయన Buddihst economicsకి ఒక అవకాశం యిచ్చేవాడో లేదోకానీ, మన షాపింగ్ కాంప్లెక్స్ లు, మురికివాడలు, బాంబు పేలుళ్ళు, పబ్ లు, కారులు చూసి ఏమాత్రం గర్వపడేవాడు కాదు. బహుశా, మన అవివేకతకి నిరసనగా, మూడు వారాలు నిరాహారదీక్షకి, ప్రార్ధనకి పిలుపు యిచ్చేవాడేమో.



- రమణ

2 అక్టోబరు 2008


***

No comments:

Post a Comment