Tuesday, September 16, 2008

అరవైల కోసం కండలు

అపర్ణా, మా అమ్మయి రెండునెల్లగా వూళ్ళో లేక రోజూ ఒక కొత్త తెలుగు సినిమా చప్పున, ఈ రెండు నెలల్లో దాదాపు ఓ ఏభై తెలుగు సినిమాలు చూసివుంటాను. చాలా ఏళ్ళు చూడకుండా తప్పించుకున్న హాస్యం పేరుమీద చెలమణీ అయ్యే అపహాస్యాలు, పాటల ముసుగులో సాఫ్ట్ పోర్న్, చూసి తరించాను. ఎక్కువ సినిమాల్లో కనిపించే ఒక దృశ్యం - బ్రహ్మానందం జిమ్ లో కసరత్తు చేస్తూ వుంటాడు. అతని చుట్టూ అతనిలాగే వికారంగా (లావుగా అనే అర్ధంలో) వున్న కొందరు వుంటారు. వాళ్ళు రకరకాల యంత్రాలతో మహా కసరత్తు చేస్తున్నట్టు నటిస్తుంటారు. బాగా సిగరట్లు కాలుస్తు, తాగుతూ తిరిగే హిరో అతని భుజం మీద చేయి వేసేసరికే బ్రహ్మానందం తట్టుకోలేక కుయ్యొమొర్ఱో అంటూ వుంటాడు. అది చూసి మనం నవ్వాలి. ఇందులో ఎలాంటి అర్ధాలు రావచ్చూ? ఎంత కసరత్తు చేసినా కుర్ఱ వాళ్ళ బలం పెద్ద వాళ్ళకి రాదనా? హీరోల బలం కామెడియన్లకి రాదనా? బలం ‘రక్తం’ వల్ల వస్తుంది కానీ సాధనతో కాదన?

అమెరికాలో శరీర సౌష్టవం (Physical fitness) పరిశ్రమ బిలియన్ డాలర్లు పైగా విలువ చేసే పరిశ్రమ. పూర్వం మద్రాసులో వీధికి ఒక గుడి, బాగా డబ్బు చేసిన వాళ్ళ యింటికీ కూడా ఒక గుడీ వుండేవి. అలాగే అమెరికాలో ప్రతి చిన్న టౌన్ లోనూ, వీధికి ఒకటి కన్నా ఎక్కువే జిమ్ లు, హెల్త్ క్లబ్ లు కనిపిస్తాయి. చాలా కార్పరేట్ కంపెనీలు వాటి ప్రంగణంలోనే ఫలహారశాలతో పాటు వ్యాయామశాల కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ బిలియన్ డాలర్ల పరిశ్రమకి జరిగే మిలియన్ల డాలర్ల ప్రచారం, దానికితోడు ప్రధానస్రవంతి మాధ్యమాలలో అంతర్లీనంగా జరిగే ప్రచారం – ఉదాహరణకి షారుక్ ఖాన్ “ఓం శాంతి ఓం”, కరీనాకపూర్ సైజ్ జీరో కథలు – జిమ్ లో చేరడం పట్ల వ్యామోహాన్ని కలిగించడంలో మంచి ఫలితాలే సాధిస్తున్నాయి. ఈ మధ్య ఒకామె అంటుంటే విన్నాను, ఆడవాళ్ళ జీన్స్ డిజైన్ చేసే డిజైనర్లు దాదాపు అందరూ లోరైజ్ (బొడ్డుకి చాలాకింద నుంచే వుండే) జీన్స్ మాత్రమే డిజైన్ చేస్తున్నారుట, అవి సన్న నడుంవున్న ఆడవాళ్ళకే నప్పుతాయి. ఆమె దీన్ని ఒక కుట్రగా వర్ణించింది.

కసరత్తు అవసరమా లేదా అన్న విషయమై చాలా పరిశోధనలే జరిగాయి. క్రమం తప్పకుండా శారీరకమైన శ్రమ / వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలే వుంటాయన్నది అందరూ ఒప్పుకున్న విషయమే. అయితే కసరత్తు సిక్స్ పేక్ కోసమో, సైజ్ జీరోకోసమో మాత్రమే అయితే, అది ఎంతవరకూ సాధ్యమనే విషయం పక్కన వుంచి, దాని ప్రయోజనంకూడా చాలా పరిమితం. వ్యాయామం గురించి జరిగే ప్రచారం చాలా వరకూ రూపం (shape) గురించి వుంటోంది. కాబట్టి రూపం విషయమై పెద్ద అసక్తి లేనివాళ్ళలో చాలామందికి వ్యాయామం కావాలంటే రోజు నడిస్తేనో, మెట్లు ఎక్కుతూ, మాములు రోజు వారిగా చేసే పనులు చేస్తేనో చాలనే అభిప్రాయం వుంది. అవన్నీ వ్యాయామమే, కానీ, అది సరిపోదు. మనకి యిష్టం వున్నలేకపోయినా, మనలో చాలామంది ఎనభఏళ్ళు దాటేవరకూ బతికే అవకాశం చాలా ఎక్కువ. అలాంటప్పుడు రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోవడం ఎంత అవసరమో, చురుగ్గా తిరగడానికి అవసరమైన కీళ్ళు, కాళ్ళు, చేతులు, బలం కూడబెట్టుకోవడం కూడా అంతే అవసరం.

వయసు పెరగడంలో భాగంగా శారీరకంగా ఒచ్చే ఒక మార్పు, కండ కరిగిపోవడం. తగినంత బరువులు ఎత్తడం (weights), నిరోధన శిక్షణ (resistence training), కండరాలని సాగదీసే శిక్షణ చేయడం ద్వారా, కండ కరగడం, కీళ్ళు వెసులుబాటు కోల్పోవడం వంటివి కొంత వరకూ నిరోధించవచ్చు. అందుకే యిప్పడు జిమ్ లో ఎంత బరువు ఎత్తగలరు, ఎంత వేగంగా పరిగెత్తగలరు, అలా పరుగుపెడుతున్నప్పడు గుండె ఎలాకొట్టుకుంటోంది అనేవాటిని బట్టి వయసుతో పాటూ, ‘శరీరం వయసు’ అని యింకో లెఖ్ఖ చలామణీలోకి వచ్చింది. మీ వయసు 65 అయినా శక్తిని, చురుకుని బట్టి మీ శరీరక వయసు 45 కావచ్చు. ఏభైల్లో వుండి, మొహం 50 లాగా కనబడుతూనే ముఫ్పైల్లో వున్న నాకన్న పది రెట్లు ఎక్కువ బరువులు ఎత్తేవాళ్ళని, చొక్కాలు తీసేస్తే అరవైల ముఖాలకి నలభైల శరీరలు వున్నట్టు వున్న వాళ్ళని చాలామందినే నేను YMCAలో చూసాను.

నడవడం, పరిగెత్తడం, ఆటలు ఆడడం లాంటివి హృదయానికి సంబంధించిన వ్యాయామాలు – శ్వాశక్రియ శిక్షణకి అవి అవసరం. సన్నటి ఆరోగ్యకరమైన కండ ఏర్పడడానికి బరువులు ఎత్తడం ఒకటే దారి. బరువులు ఎత్తడం అనగానే మనకి కరణం మల్లీశ్వరే గుర్తుకు వస్తే అది మన తప్పుకాదు. కానీ బరువుతో వ్యాయామం చేయడం అంటే ఆమె లాగా బరువులు ఎత్తడం మాత్రమే కాదు. చాలా రకాల యంత్రాలు ఒకొ్క్క కండరసమూహానికి దానికి మాత్రమే శిక్షణ యిచ్చేలాగా సహాయపడేవి చాలావున్నాయి. ఏవయసు వాళ్ళైనా గాయాల భయం లేకుండా శిక్షణ ప్రారంభించవచ్చు. బ్రహ్మానందం వ్యాయామం చేస్తున్నట్టు నటించడం కాకుండా నిజంగా చేస్తే ఈ సారి ఆదెబ్బ, కొట్టిన హీరోకే తగలచ్చు.

కలం తాజా : YMCAలో చేరిన కొత్తల్లో అక్కడ స్నానం చేయడానికి చాలా సిగ్గుగా వుండేది. చొక్కావిప్పి, బొజ్జకనబడకుండా ఊపిరి బిగబట్టి కష్టపడి నడుస్తుంటే అక్కడ ముళ్ళపూడి వెంకటరమణగారు చెప్పిన ఆరున్నర అడుగుల పొడుగు ఎకరన్నర ఛాతీ వున్న సోదరులు నగ్నంగా – వాళ్ళ పడగ్గదుల్లో తిరిగినంత ధీమాగ – తిరుగుతుంటే, ‘ఔరా, ఎందుకు నాకీ దురవస్థా’ అనిపించేది. అపర్ణతో చెబితే అటు ఆడవాళ్ళ లాకర్ రూముల్లో అయితే వాళ్ళు ‘మేకప్ వేసుకున్నాకే బట్టలు తొడుక్కోడానికి వెళ్తున్నార’ని చెప్పింది. ‘నువ్విటు నేనటు వెళ్తే సంతోషించే వాళ్ళమేమో’ అన్నాను.

(Note: Photos are from Microsoft royalty free clip art collection)

1 comment:

  1. బాగా రాశారు. ఐతే, ఉపోద్ఘాతం బిల్డప్పు కొంచెం పొడుగైంది. శరీరానికి క్రమం తప్పని సరైన వ్యాయామం అవసరం.

    ReplyDelete