Tuesday, April 14, 2009

డార్క్ రూమ్ కలలూ, లైట్ రూమ్ 2.2

గొప్ప ఫోటోలు తీయగలగాలటే కనీసం 35 mm SLR అయినా వుండాలనిపించేది. అది సంపాదించాకా, మంచి ఫాస్ట్ గ్లాస్ / (కేనన్) L లెన్స్ వుండి తీరాలనిపించేది. ఆ తరవాత ఫ్లాష్ / లు అత్యవసరమైన వాటి జాబితాలో చేరాయి. అయినా తీసిన ఫోటోలు, పత్రికలలో, వెబ్ లో కనిపించే యితరుల ఫొటోలతో ఏమాత్రం పోల్చతగ్గ స్థాయిలో వుండేవి కావు. సౌందర్య దృష్టి గురించి, కంపోజిషన్ గురించి కనిపించిన సాహిత్యం తిరగేసి, ‘రూల్ ఆఫ థైర్డ్’ లు ‘గోల్డన్ రేషియో’ల గురించి తలబద్దల గొట్టుకున్నా ప్రింట్లు చూసాకా నిరుత్సాహం కలిగేది. తరవాత కొన్ని రోజులు స్లైడ్లు షూట్ చేసేప్పుడు, వెల్వియాని లైట్ బాక్స్ మీద వుంచి లూపేతో చూస్తే చాలా జన్మధన్యమైనట్టు వుండేది. కాని డవలప్ చేయించడానికి పదిరోజులు పైగా పట్టడమే కాక 36 రోల్ కి 15 డాలర్లు పైగా అయ్యేది. ఈ లోపు eBayలో ఎనలార్జర్లు, జోబో ప్రోససర్ లు చూసినప్పుడల్లా ‘ఈ బాత్ రూమ్ / వాషర్ డ్రైయర్ ఉన్న చోటుని డార్క్ రూమ్ చేస్తే పోలా?’ అనిపించేది. అవేమి సాధ్యంకాలేదు, కానీ లైట్ రూమ్ 2.2 ని చూసాకా, నా డార్కరూమ్ కోరిక తీరినట్టే వుంది.

రంగంలో వున్న వెలుగు, నీడ, రంగులని పట్టి సరైన ఎక్సపోజర్ ఏమిటో నిర్ణయించడం ఒకప్పుడు చాలా జటిలమైన విషయం. దానిగురించి ‘జోన్ సిస్టమ్’ ఒకటి రూపొందింది. ఏన్సిల్ ఆడమ్స్ (Ansel Adams) నుంచి వందల మంది గొప్ప ఫొటొగ్రాఫర్లు - ముఖ్యంగా లాండ్ స్కేప్ ఫోటోగ్రాఫర్లు – వేల కొలది వ్యాసాలు ఆ విషయం మీద రాసారు. సాంకేతికంగా అనితరసాధ్యమైన ఫోటలు తీసిన ఏన్సిల్ ఆడమ్స్, స్పాట్ మీటర్ ఉపయోగించి రంగంలో పలు చోట్ల, వెలుగు, నీడ లని మీటర్ చేసి, దాని సగటుని లెక్కగట్టి, ఫొటో తీసేటప్పుడు వెలుగు సరిగ్గ రికార్డయ్యేలంటి ఎక్సపోజర్ ని కెమెరాలో పెట్టి, నెగెటివ్ డార్క్ రూమ్ లో డవలప్ చేసేటప్పుడు నీడలు సరిగ్గ వచ్చేలాగా డవలప్ చేసేలాగా సమయాన్ని పెంచి, దాన్ని ప్రింట్ చేసేప్పుడు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మాడ్చడం (Burn) లేద దాచడం (Dodge) లాంటి గమ్మత్తులు వుపయోగించి అద్భుతమైన ప్రింట్లు తయారు చేసాడు.

ఇమొజిన్ కన్నింఘమ్ (Imogen Cunningham) ఒక పోట్రయిట్ ఫోటో ప్రింట్ కి రాసుకున్న నోట్సు చూస్తే, బాంబు తయారుచేసే ఫార్ములా నోట్సు అంత క్లిష్టంగా కనిపిస్తుంది. ఆ నోట్సులో ఆమె, యిక్కడ యిన్ని సెకన్లు మాడ్చాలి, యిక్కడ యింత సేపు దాచాలి, దానికి వాడవలసిన రూపం యిది, అంటూ అతిచిన్న వివరంకూడా రాసారు. అద్భుతంగా కనపడే ఆ ఫోటోలు అలా రావడానికి ఫోటోగ్రాఫరు ఎన్నిగంటలు డార్కరూమ్ లో శ్రమపడాల్సి వచ్చేది ఆ నోట్స చూస్తే తెలుస్తుంది. సొంతంగా డెవలపింగ్, ప్రింటింగ్ చేసే ఫోటోగ్రాఫర్లకి ప్రక్రియలో అన్ని చోట్లా నియంత్రణ వుండేది. కలర్ ట్రాన్పరన్సీలు, నెగెటివ్ లు వచ్చాకా, డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం చాలా సంక్లిష్టమవడమేకాక, దానికి కావలసిన పరికరాలు ఖరీదయినవి కావడంతో ఔత్సాహికంగా ఫోటోలో తీసే వాళ్ళు సొంతంగా డార్కరూమ్ వుంచుకోగలిగే అవకాశం తగ్గిపోయింది. కొంతమంది వృత్తి ఫోటోగ్రాఫర్లకి, ఔత్సాహికులకి ఒతనుగా ప్రింట్ చేసే స్టూడియోల వల్ల కొంత వరకు నియత్రణ / ప్రమేయం మిగిలినా చాలామందికి చివరిగా వచ్చే ఫలితం (ప్రింట్)లో నియంత్రణ తగ్గిపోయింది. డిజిటల్ వల్ల మళ్ళీ ఔత్సాహికులకి మంచిరోజులు వచ్చాయి.

వృత్తి ఫోటోగ్రాఫర్లు అనుసరించే డిజిటల్ పనివిధానం, ఫోటోలు తీసేప్పుడు ‘RAW’ ఫార్మేట్ లో తీసి, తరవాత డిజిటల్ డార్క్ రూమ్ లో ఆ నెగెటివ్ ని (RAW ఫోటోని) డెవలప్ చేసి, ప్రింట్ చేయడానికి అనువుగా చేయడం. యిలా చేయడం వల్ల చాలా లాభాలు వున్నాయి, పూర్వం ఫొటోగ్రాఫర్లకి డార్కరూమ్ లో ఏమేమి చేయడానికి అవకాశం వుండేదో అవన్నీ యిప్పుడు డిజిటల్ డార్కరూమ్ లో చేయగల ఆస్కారం వుంది. ఉదాహారణకి పోట్రయిట్ ఫోటోగ్రాఫర్లు తరచు చేసేపని, ఫోటోలో క్లారిటీని కొంత తగ్గించడం. దానివల్ల మొటిమలు, కళ్ళ చుట్టు వుండే చారలు లాంటివి దాదాపు అదృశ్యం అయిపోతాయి, అంతకంటే ముఖ్యంగా పలురకాల లైట్ సోర్స్ నుంచి వచ్చే వెలుగు వల్ల ఫోటోలో కనిపించే అసహజమైన రంగులని సరిచేయడం, లైట్ రూమ్ లాంటి డిజిటల్ డార్కరూమ్ లో చేయడం చాలా సులభం. క్రిందటి వారం, లైట్ రూమ్ లో డవలప్ చేసిన ఒక ఫోటో, పాత టపాలో వుంది, ఆసక్తి వుంటే తిరగేయచ్చు. డెవలప్ చేసిన సెట్టింగ్స్ కూడా అందులో వున్నాయి.

2 comments:

  1. నాలుగు రోజులనించి మీకు కామెంటు రాద్దామలుకుంటున్నా కాని పని ఒత్తిడిలో కుదరలేదు.
    నాకు కూడా మీలాగే ఫోటోలు తీయడం ఇష్టం, ఈమధ్యే కొత్తగా కానాన్ EOS 450D with 18-200mm కొన్నాను, నా మొదటి SLR కెమెరా ఇదే. ఇప్పుడిప్పుడే పూర్తిగా నేర్చుకుంటున్నా. నేను కూడా మీలాగే నా ఫోటోలు పోల్చదగ్గ స్థాయిలో లేవేంటబ్బా అనుకుంటుంటే మీ టపా చూసి RAW ఫార్మాట్ లాబాలు అర్థమయ్యాయి.
    వీలైతే నేను తీసిన ఫోటోలు చూసి మీ అబిప్రాయం తెలుపగలరు.
    మీ ఫోటోలు చూస్తా మీది వరంగల్ అనిపించింది, వరంగలేనా! నాదైతే వరంగలే.

    ReplyDelete
  2. ఇంతకుముందు మరచిపోయాను, ఫోటోలు చూడమన్నాను కాని లింకు ఇవ్వలేదు.
    http://picasaweb.google.com/thopucherla.s

    ReplyDelete