Sunday, May 17, 2009

ఎన్నికల ఫలితాలు

ఈ ఎన్నికల ఫలితంగా రాష్ర్టంలో మొదటి సారిగా హంగ్ ఏర్పడే అవకాశం, దేశంలో అద్వాని ప్రధాని అయ్యే అవకాశం వుందన్న అంచలనాని తలక్రిందలు చేస్తూ కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ స్వంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో వుండడం అద్వాని అభిమానులకూ, అలాగే, తెలంగాణా వాదులకూ మింగలేని పరిణామం. ఓట్ల లెక్కింపుకు ముందు ఛాట్ లో ఓ తెలంగాణా వాదిని ‘ఫలితాలు ఎలా వుంటాయని నీ అంచనా’ అంటే, అతను ‘కేంద్రంలో బి.జె.పి రావాలే’ అని కోరిక వెలిబుచ్చాడు. కేంద్రంలో బి.జె.పి అధికారంలో వస్తే తెలంగాణా వంద రోజుల్లో యిచ్చేస్తారని నమ్మినా, అద్వాని, మోడీల నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పడితే మాంద్యం నేపథ్యంలో బి.జె.పి - కాలం చెల్లిన - నియో లిబరల్ ఆర్ధిక విధానాల వల్ల దేశానికి ఎంత నష్టమో అన్న భయం కానీ, టెర్రరిజం బూచి పేరుతో మైనారటీల మీద ఎలాంటి నిర్బంధాలు జరుగుతాయో అన్న ఆందోళన కానీ టి.ఆర్.ఎస్ ని, తెలంగాణా వాదులని బి.జె.పి పంచన చేరకుండా ఆపలేకపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైనది ఏమైనా చేస్తామన్న దృష్టితో సాగుతున్న పరిమిత ఆచరణకనుక దీన్ని ‘తెలంగాణా వాద’ మనే అనాలి కాని ఉద్యమం అనలేం. నావరకైతే చాలా ఆనందం కలిగించిన ఫలితాలు, ఒకటి, టి.ఆర్.ఎస్. ఘోరపరాజయం, రెండు, అద్వాని రాజకీయ జీవితానికి దాదాపు ఆఖరి ఎన్నికలాంటి ఎన్నికలో బి.జె.పి. ఓటమి, మూడు అల్లు అరవింద్ మట్టి కరవడం.

ఈ ఎన్నికలలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. ఓటర్లలో చాలామంది వయసు ముఫైలలోపు. మళ్ళీ ఐదు సంవత్సరాలలోపు ఎన్నికలు జరిగే అవకాశం లేని విధంగా ప్రజలు తీర్పు యిచ్చారు. ఓడించిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో అర్ధం అవుతున్నంత స్పష్టంగా గెలిచిన వాళ్ళు ఎందుకు గెలిచారో తెలియడం లేదు. రాష్టంలో ప్రజలు కాంగ్రెస్ ని తిరిగి ఎన్నుకున్నారంటే ‘రాజశేఖరుడి మీద మోజు తీర’కా? లేక బరిలో ఉన్న యితరుల కన్నా ఆయనకే ఎక్కువ విశ్వసనీయత వుందని భావించారా? లేక అంత కన్నా యోగ్యత వున్న యితర పార్టీల వారికి – ప్ర.రా.పా, లోక్ సత్తా – యింకా సరైన నిర్మాణం లేకనా? ప్ర.రా.ప. మీద ప్రజలకి గణనీయమైన విశ్వాసం లేదనడానికి చిరంజీవి ఓటమి, అల్లు అరవింద ఓటమి సాక్ష్యంగా చూపచ్చు. లోక్ సత్తా జయప్రకాష్ గెలవడం చాలా సంతోషమైన విషయం. రామచంద్ర గుహ అవుట్ లుక్ లో ఎన్నికల గురించి రాసిన వ్యాసంలో భవిష్యత్తు ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా లోక్ సత్తాలంటి పార్టీలు రూపుదిద్దుకుంటాయని చెప్పిన జోస్యం సరైనదనడానికి యిది ఒక సూచనగా తీసుకోవచ్చు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పటినుంచి ఎన్.టి.ఆర్. లాగా మొదటి ఎన్నికలలోనే అధికారం సంపాదిస్తామని ధీమాగా చెప్పారు. తరువాత జరిగిన పరిణామాలు ఆ నమ్మకం కలిగించలేదు. వ్యక్తిగతంగా చిరంజీవి ఎన్.టి.ఆర్. లాంటి వక్తకాకపోవడం, ప్ర.రా.పకి సొంత పేపరు, ఛానల్ లేకపోవడం మాత్రమే వారి భంగపాటుకి కారణమని నేను భావించను. ఎన్.టి.ఆర్. విజయానికి కారణమైన బలమైన చారిత్రక శక్తి, జస్టిస్ పార్టీలాంటి బ్రాహ్మణ వ్యతిరేక, రాజకీయ సాంఘిక ఉద్యమాలలో పనిచేసిన అప్పటి పురోగామి కమ్మ కులస్తుల సంఘటిత ఆకాంక్ష. దానికి తగ్గ ముఖచిత్ర ప్రతినిధిగా ఎన్.టి.ఆర్. ముందుకు రావడం వల్లనే ఆయన విజయం సునాయాసం అయింది తప్ప దాన్ని వ్యక్తి విజయంగానో దీన్ని వ్యక్తి పరాజయంగానో భావించడం పొరపాటు. భవిష్యత్తులో, వెనకబడ్డ వర్గాల రాజకీయ ప్రతినిధిగా ప్ర.రా.ప. విశ్వసనీయత సాధించ గలిగే అవకాశం ఎంత? వచ్చే ఎన్నికలవరకు ప్రరాప మనగలుగుతుందా అన్నదే ప్రస్తుత పరిస్థితుల్లో అస్పష్టంగా వుంది.

కె.సి.ఆర్. ఎన్నికల ఫలితాల తరువాత చేసిన క్లుప్తమైన ప్రసంగంలో ‘పోరాటం కొనసాగుతుంది’ అని చెప్పారు. తె.రా.స. ఓటమికి మాత్రమే కాక, కూటమి ఓటమికి కూడా కె.సి.ఆర్.కొంత కారణమని కూటమి నేతలు చెప్పిన విషయం సత్యదూరం కాదు. ఆయన నాయకుడిగా కొనసాగినంతకాలం పార్టీకి కానీ, ఆయన పోరాటంగా పేర్కుంటున్న వాదానికి కానీ విశ్వసనీయత పెరిగే అవకాశం లేదు. ఈ వాదానికి బలం చేకుర్చదలుచుకుంటే, అధ్యక్ష పదవికి – నిజంగా - రాజీనామ చేసి, మేనల్లుడినో, కోడుకునో మరో డమ్మీనో ఆస్థానంలో కూర్చోపెట్టక, యింటా బయట విశ్వసనీయత వున్న జయశంకర్ లాంటి ఉద్యమనేపథ్యం వున్న వ్యక్తికి పార్టి పగ్గాలు యివ్వడం ఉత్తమం. చాలామంది తెలంగాణా వాదులు, ముఖ్యంగా దేశం బయట వుండి తెలంగాణా కోసం తాపత్రయపడుతున్నామనుకునే వాళ్ళు, ఆయన వైఖరి లక్ష్యానికి ఆటంకం కలిగిస్తోందా లేదా అన్నది పక్కన పెట్టి, వాళ్ళు చేయలేని పని – ఆంధ్రావాళ్ళని బూతులు తిట్టడం – ఈయన చేయడం వల్ల చాలా ఆనందం పొందుతుండచ్చు. సంయమనంతో వాదం చేయగల వ్యక్తులు, ముఖ్యంగా రెండు రాష్ట్రాలుగా విడిపోవాలంటే దానికి అవసరమైన ఆర్ధికమైన (రెవెన్యూ, బడ్జట్) సర్దుబాట్లు విషయాలగురించి ఆలోచించగలిగే వ్యక్తులు రంగం మీదకి రాకుండా, ఈ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం.

రాష్ట్రంలో కాంగ్రెస్ కి కొంతైనా బయట సహాయం అవసరమైన బలహీన స్థితిలో ఉండి వుంటే బాగుండేది. యింకో ఐదు సంవత్సరాలు ఎవరూ అడ్డుకోలేరనే ధైర్యం వచ్చాకా, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వుండడంతో, నక్సలైట్ల విషయంలో, నిబంధనల విషయంలో, తెలంగాణా విషయంలో రాజశేఖర రెడ్డి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలైన తీసుకోగలరు. ఆయన రాజకీయ ప్రత్యర్ధుల్ని ఎలాంటి అగచాట్లకైనా గురిచేయగలరు.

ఏమైనా ప్రజలు చాలా విజ్ఞతతో గొప్ప తీర్పు యిచ్చారు. హరీష్ రావుని గొప్ప మెజారిటితో గెలిపిచారు. కె.సి.ఆర్.ని ఓడిస్తామని భయపెట్టి గట్టెక్కించారు, రోజాని అసెంబ్లీకి రాకుండా చేసారు. ప్రరాపాని భంగపరిచారు. అల్లు అరవింద్ ఘోర పరాజయం మాత్రం నాకు పట్టలేనంత సంతోషం కలిగించింది - రాజనాల లాగా వికటాట్టహాసాలు చేయించింది. ఎంతైనా ప్రజల విజ్ఞతముందు మన అహంకారాలు, ఆ గుడ్డితనంతో మనం రచించే భవిష్యత్ చిత్రపటాలు నిలబడతాయా?

3 comments:

  1. "అల్లు అరవింద్ ఘోర పరాజయం మాత్రం నాకు పట్టలేనంత సంతోషం కలిగించింది - రాజనాల లాగా వికటాట్టహాసాలు చేయించింది."

    :-)

    ReplyDelete
  2. చక్కటి వ్యాసం. "వ్యక్తిగతంగా చిరంజీవి ఎన్.టి.ఆర్. లాంటి వక్తకాకపోవడం, ప్ర.రా.పకి సొంత పేపరు, ఛానల్ లేకపోవడం మాత్రమే వారి భంగపాటుకి కారణమని నేను భావించను." -నేనూ భావించను.

    ReplyDelete
  3. "ఎన్.టి.ఆర్. విజయానికి కారణమైన బలమైన చారిత్రక శక్తి, జస్టిస్ పార్టీలాంటి బ్రాహ్మణ వ్యతిరేక, రాజకీయ సాంఘిక ఉద్యమాలలో పనిచేసిన అప్పటి పురోగామి కమ్మ కులస్తుల సంఘటిత ఆకాంక్ష. దానికి తగ్గ ముఖచిత్ర ప్రతినిధిగా ఎన్.టి.ఆర్. ముందుకు రావడం వల్లనే ఆయన విజయం సునాయాసం అయింది తప్ప దాన్ని వ్యక్తి విజయంగానో దీన్ని వ్యక్తి పరాజయంగానో భావించడం పొరపాటు"

    రమణ గారు, పైన ఉదహరించిన విషయం లో కొద్దిగా విబేదించే అంశాలున్నాయనిపిస్తుంది, నాకు తెలిసి బ్రాహ్మణ వ్యతిరేకం మన తెలుగు రాష్ట్రం లో అప్పటి వరకు గాని లేక ఇప్పుడు గాని లేదు,ఒక్క తమిళనాడులోనే ఆ వ్యతిరేకత ఉన్నింది..ఇప్పటికీ ఉన్నది. ఇక కమ్మ కులస్టుల సంఘటిత ఆకాంక్ష అన్నది కూడ అనుమానమే..? నేను కడప ప్రాంతానికి చెందిన వాడిని యన్.టి.ఆర్ పార్టీ పెట్టి ఎన్నికలలలో విజయం సాదించిన సమయం లో విధ్యార్థి దశలో ఉన్నాను,మా ప్రాంతం లో అసలు కమ్మ కులస్థులే లేరు..!ఒక్క కోస్తా(సర్కారు జిల్లాల) ప్రాంతంలోనే కమ్మకులస్థులు ఎక్కువ,ఇక తెలంగాణ ప్రాంతం లో కూడ లేరు. నాకు తెలిసి అప్పటి సమయంలో కాంగ్రెస్స్ కి ప్రత్నాయం ఎవరూ లేరు..అంతే కాక అప్పటి కాలపరిస్థితులలో యన్.టి.ఆర్ దేవుణిగా కొలవబడుతున్నందున గెలుపుకు సాద్యమయ్యింది.

    ReplyDelete