Tuesday, December 1, 2009

ఉత్తరకుమారీయం

నర్తనశాలలో రంగారావు, సావిత్రి, రామారావూ ఉన్నా, ఆ సినిమాలో వాళ్ళందర్ని మించి మార్కులు కొట్టినవాడు రేలంగే. ఉత్తరకుమారుడి పాత్రలో, తనకు ఏమాత్రం సాధ్యంకావని తెలిసీ, ప్రతిజ్ఞలు చేయడంలో, సోదరితో శతృరక్తంలో జలకాలాడతానని పద్యాలుపాడి యుద్ధరంగలోకి రాగనే తన బట్టలు తనే తడుపుకోడంలో, ఎవరి దయవల్లో సాధించిన విజయ చిహ్నాలని తనవిగా చాటుకోవడంలో రేలంగి ప్రదర్శించిన నటన చూసినవాళ్ళకి ఆ సన్నివేశాలు గుర్తుకొచ్చినప్పుడల్లా పట్టలేనంత నవ్వోస్తుంది. అన్నగారు కూడా ఉన్నారు కనుక గోరక్షణకేం ఢోకాలేదని ప్రేక్షకులకి ముందే అర్ధమయిపోయి మరీ రేలంగి డంబాలు కవ్విస్తాయి. ఎలాగోలాగా యద్ధంలోకంటూ అడుగుపెడితే అర్జునుడు దొరక్కపోతాడా అన్న అత్యాశతో కె.సి.ఆర్. వెంట చచ్చుడో వచ్చుడో అంటూ అమాయకంగా దూకిన వారిలో ఓ నలుగురి మరణంతో ఈ ప్రహసనం విషాదాంతంగా మారుతోంది.

ఉద్యమంప్రారంభానికి ఒకరోజు ముందు ఒక టి.వి. ఛానల్ ఎన్నారైలని ఇంటర్వ్యూ చేసి మీరు ఎలాంటి సాయం చేస్తారని అడిగితే, వారు ఎంత డబ్బు అవసరమైనా పంపిస్తాం అని చెప్పారు. బ్లాక్ ఫ్రైడే సూపర్ డీల్స్ కొని మిగుల్చుకున్న నాలుగురూకలు షేర్లుకొనేకంటే కె.సి.ఆర్. గుడ్ విల్ షేర్లకి పెట్టుబడి పెట్టడం లాభదాయకమని వారు భావించి ఉండవచ్చు.

పొద్దుగూకుల ఈగలుదోలుతా ఆ టి.వి. ముంగల కూసునేకంటే జర బజారు దిక్కు పోయి రారాదే అన్నమాట తప్పించుకోవడానికో, ఉచిత ఇడ్లీల రుచి మరిదేనికి రాదన్న తత్వం తెలిసో కొందరు తెలంగాణా మేధావులు కె.సి.ఆర్. వెంట ఉండచ్చు. ఎదో జరుగుతుందని, యిది సరైనా పద్ధతనీ కాదుకానీ, అదృష్టం కలిసొచ్చి జాక్ పాటేకొట్టిసి, ప్రత్యేకరాష్ర్టమే వచ్చేస్తే, తీరాచేసి ఈ టైంలో మనం రోడ్డుమీద ఉండకపోతే తర్వాత పైరవీలు చేయడానికి అవకాశాలు తగ్గపోతాయేమోనని ముందుచూపుతో ఆయన వెనక చేరిన ఉద్యమకారులు కొందరు ఉండిఉండచ్చు.

కె.సి.ఆర్.కికానీ, యిప్పటికే ఈ పేరుచెప్పుకుని లాభాలపొందిన వాళ్ళు, యికముందు పొందబోయేవాళ్ళు ఎవరికీ ఏమీ నష్టం జరగలేదు. జరగదు. కానీ, తెలంగాణ వచ్చిన రాకపోయినా వారి జీవితాల్లో గొప్ప మార్పులు ఏమీ జరగగలిగిన ఆస్కారం లేని ముగ్గురు – భూక్యా ప్రవీణ్ (24), ఉగునూరు శ్రీకాంత్ (17), దండిక పృధ్విరాజ్ (22) – యిప్పటికే మరణించారు. ఇంకా అలాంటి ఎన్ని వందల అమాయకుల చావుకు కారణం కానున్నారో ఈ ఉత్తరకుమారులు.

8 comments:

  1. ika ippudu ke.si.aar chetilO ledu, chooddaam meeru evarini vimarshistaarO

    ReplyDelete
  2. కేసీఆర్ ఉత్తర కుమారుడన్నారు బాగానే వుంది. మరి అర్జునుడు దొరక్క పోతాడా అని దూకడమేంటి సోదరా? మీకు భారతం తెలియక పొతే నర్తన శాల మరో సారి చూడండి. ఉత్తర కుమారుడు ఎన్ని ప్రగల్భాలు పలికినా అర్జునుడి రూపం లో తెలంగాణా జనాలు అతనికే అండగా ఉన్నారని గ్రహించండి.

    ఏ కళ నున్నారో గాని మీరు సరైన analogy నే ఎన్నుకున్నారు. నాయకుడు ఉత్తర కుమారుడైనా ఇప్పుడు తెలంగాణా ప్రజలు అర్జునుని వలె విజ్రుంభించ బోతున్నారు. తేరగా ఉత్తర గో గ్రహణానికి వచ్చిన వారు ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించుకోండి.

    ReplyDelete
  3. Anonymous said..
    "కేసీఆర్ ఉత్తర కుమారుడన్నారు బాగానే వుంది. మరి అర్జునుడు దొరక్క పోతాడా అని దూకడమేంటి సోదరా? మీకు భారతం తెలియక పొతే నర్తన శాల మరో సారి చూడండి. ఉత్తర కుమారుడు ఎన్ని ప్రగల్భాలు పలికినా అర్జునుడి రూపం లో తెలంగాణా జనాలు అతనికే అండగా ఉన్నారని గ్రహించండి.

    ఏ కళ నున్నారో గాని మీరు సరైన analogy నే ఎన్నుకున్నారు. నాయకుడు ఉత్తర కుమారుడైనా ఇప్పుడు తెలంగాణా ప్రజలు అర్జునుని వలె విజ్రుంభించ బోతున్నారు. తేరగా ఉత్తర గో గ్రహణానికి వచ్చిన వారు ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించుకోండి."
    (ఎందుకో ఆ కామెంట్ అప్రూవ్ చేసిన పబ్లిష్ కాలేదు. అందుకే, కాపీ పేస్టె చేసాను.)

    ReplyDelete
  4. మా అజ్ఞాత మంచిగ చెప్పిండు కదా... గుండు బాబు... పనీ పాట లేనొల్లు... స్వార్థ పరులు మాత్రమే ఈ ఉద్యమంల కనిపించారు కదా మీకు.... ఈసారి తెలంగాణ రాకపోతే ఇంకెప్పుడూ రాదు.... ఉప్పెనలా లేవండి... ఉత్తుంగ తరంగాలై కదలండి... తెలంగాణ అంతటా అంధ్ర బోర్డులు పీకి..తెలంగాణ అని బోర్డులు పెట్టండి...

    జై తెలంగాణ...

    ReplyDelete
  5. తెలంగాణా లో అమాయకుల చావుకు మా ఉత్తర కుమారులే కారణమా?
    మీ దుర్యోధన, దుశ్శాసన, శాకునాది దుష్ట చతుష్టయం పాత్ర ఏమి లేదా?

    మా రాష్ట్రాన్ని మాకు వదిలేయండి బాబూ అన్న న్యాయమైన డిమాండు గురించి చర్చించ కుండా ఎంతసేపూ ఇట్లా కోడిగుడ్డుకు ఈకలు పీక్కుంటూ నే కూచుంటారా?

    సిరిసిల్లలో ఎందఱో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చి పోతున్నారు. తెలంగాణాకు న్యాయం గా దక్కాల్సిన నదీ జలాల్లోని వాటా దక్కక పోవడం వల్ల పొలాలన్నీ ఎండిపోతూ మరెందరో రైతులు ఆత్మా హత్యలుచేసుకుంటున్నారు.

    ఏవిధంగా చూసినా తెలంగాణాకు చావులు తప్పేట్టు లేవు.

    ReplyDelete
  6. @రాజన్న: తెలంగాణాకు అన్యాయం జరిగింది. రాయలసీమకు అన్యాయం జరిగింది. ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. విడిపోవడమే పరిష్కారమైతే రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేద్దాం. లేదా పక్కరాష్ట్రాల్లో కలుద్దాం.కానీ అది ప్రజాస్వామికంగా జరగాలి. ఉద్యమాల పేరుతో రౌడీయిజం చేసిమాత్రం కాదు. కేసీఆర్ లాగా నాటకాలాడిమాత్రం కాదు.

    జై తెలంగాణా! జై రాయలసీమ!! జై ఉత్తరాంధ్ర!!!

    ReplyDelete
  7. telangana naadi andhra needi ani chepadaniki asalu evaru aa k.c.r rastraani mukalu chese hakku vadiki evaru echaru??? edi bharathadesam ekada evarina epudaina ekadikyna vele hakku undi ayina andhrulu telagana lo undatam valla vachina nashtamenti ee matti andaridi evari sontham kadu adi gurthucheskoni bhadyathaga pravarthisthe bavuntundi k.c.r nuvu bagane untav netho porataniki vachi dikkuleni chaavu chasthunaru ne telangana prajalu anthaga telangana tevalanukunte nuvu bali avvu ne prajalani bali cheyadam kadu ela nakkala kapati naatakaalu pradarsinchaku

    ReplyDelete
  8. telangana naadi andhra needi ani chepadaniki nuvevaru k.c.r oka naayakudiki undalsina lakshanam vibhajinchi matladatam kadu thelsuko... aina ee matti andaridi ne okkadisothu kaadu telagana prajala sothu kaadu nadi andhra nedi telangana ani anukune mundhu nenu bharatheeyudini ani gurthu thechuko naayakudi paalanalo antha kalisi undali kaani ela vidadhese prayathnam kadu kavalsindi... neku anthaga telangana kavalanukunte mundhu nuvu bali avvu ne prajalani bali cheyadam kadu.... ala kakunda ne prajalani bali chesthu poratam chese ne udyamam epatiki phalinchadu gelupukaina votamikaina jeevinchadaanikaina maraninchadaanikaina mundhu nuvu undu venakala ne prajalu vastharu anthe gaani ela piriki vaadila donga sabhadaalu cheyaku... kalisiunte kaladhu sukham anaru vedadhesi nuvu pondhe labham enti???? konchem bhadyathaga pravarthinchu naayakudiki undalsina lakshanam adi kaani nuvu jithulamaari nakkala pravarthisthunav manchidi kadu k.c.r be like a leader but not like cunning fox...

    ReplyDelete