Thursday, October 8, 2009

బాలగోపాల్

“యాత్రాపథంలో సైన్ పోస్ట్ కూలిపోయింది”


తెలుగుదేశంలో మేధావులంతా కుడినుంచి ఎడం నుంచి తమ పంచెలుడిపోతున్న స్పృహ కూడా నశించి కోలాహలంతో ఒక రాజు గారి మరణానికి నివాళులర్పించడానికి పోటిపడుతున్న రోజుల్లోనే వాళ్ళకి మైళ్ళ దూరంలో చేతులు పైకిముడిచిన ఉప్పు చారాల చొక్కాతో నిలబడి, రంపచోడవరం ఎజెన్సీ ఏరియాలో మలేరియాతో మరణిస్తున్న పేద వాళ్ళ నిత్యమరణానికి నివాళి రాసిన ఒకే ఒక తెలుగు మేధావి యింత అర్ధాంతరంగా వెళ్ళిపోయాడన్న నిజం మింగుడు పడట్లేదు.

బాలగోపాల్ లేని హైదరాబాద్ ని ఆంధ్రాని ఊహించలేను. ఇండియా తిరిగివెళ్ళిపోవాలని, నేనే కాదు నా మిత్రుల చాలామంది వేసుకున్న ప్రణాళికలన్నీ ఆయన చుట్టూ కట్టుకున్నవే. ప్రకాష్ కైతే ఇండియా వెళ్ళడం బాలగోపాల్ తో కలిసి తిరగడానికే. నాలుగైదు నెలలు బాలగోపాల్ తో తిరిగొచ్చి ఆ కథలతో మమ్మల్ని ఊరించేవాడు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనిపించేది మాకు. ఏ విషయం గురించి చర్చించినా బాలగోపాల్ ప్రస్తావన లేకుండా ఉండనే ఉండదు. రోజు కనీసం ఒకసారైనా ఏదో సందర్భంలో తలుచుకునే వ్యక్తి బాలగోపాల్. సైన్ పోస్టేకాదు, గీటురాయి, ఆఖరి మాట చెప్పగలిగే వ్యక్తి ఆయన.

కొంచెం శ్రద్ధ తన ఆరోగ్యం మీదకూడ పెట్టినట్టయితే, యికో ముఫై నలభై సంవత్సరాలు గొప్ప కృషి చేయగల వ్యక్తి హఠాత్తుగా నిష్ర్కమించడం గుండెల్నిపిండేస్తోంది. ఆయన రాస్తారని ఎదురుచూస్తున్న పుస్తకాలు రాసేవాళ్ళూ, ఆయన్ని అడగాలనుకున్న ప్రశ్నలకి సమాధానాలు యివ్వగలిగే వాళ్ళు మనకింకెవ్వరూ లేరు. మళ్ళీ యిలాంటి నిష్కామయోగిని ఈ జీవితకాలంలో చూడలేకపోవచ్చు. పది పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఏదో సందర్భంలో వీర నాస్తికుడు మనోహరన్ (పి.యు.సి.ఎల్) బాలగోపాల్ గురించి ప్రైవేటు సంభాషణలో మాట్లాడుతూ “Balagopal is a saint” అన్నాడు. ప్రకాషే చెప్పాడు, ఈ మధ్య బాలగోపాల్ మద్రాస్ వెళ్తే తీవ్ర అనారోగ్యంతో ఉన్న మనోహర్ ఆయన్ని చూడ్డానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడుట. బాలగోపాల్ ఆయన్ని ‘యింత అనారోగ్యంతో నువ్వెందుకొచ్చావయ్యా, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా’ అన్నాట్ట. దానికి మనోహరన్ ‘బాలగోపాల్ నువ్వు పేదవాళ్ళకి దేవుడిచ్చిన వరానివి. నిన్ను చూడ్డానికి నేను రావాలి కాని నువ్వు రావడమేమిటి’ అన్నాట్టా.

రోజుకి పదహారు పద్దెనిమిదిగంటలు పనిచేసేవాళ్ళూ, మేధావులు, గొప్పగా మాట్లాడగలిగేవాళ్ళూ, రాయగలిగేవాళ్ళు కొన్ని వేలమందే ఆంధ్రదేశంలో వుండచ్చు. కానీ బాలగోపాల్ లాగా ఆశక్తులన్ని నమ్మిన ఆదర్శాలకే బేషరతుగా వినియోగించగలిగేవారు చాలా చాలా అరుదుగా తారసపడతారు. ఆయన మీద హీరో వర్షిప్ తో పొడుగు చేతుల చొక్కాని పైకి మడమడమైతే అనుకరించగలిగాం కానీ ఆయన సుగుణాలలో ఏ ఒక్కటీ యింకా అలవర్చుకోనేలేదు. ఆయనే వెళ్ళిపోయాకా అవి నేర్చుకోగలుగుతామన్నా ఆశా కూడా యింకలేదు.

6 comments:

  1. మా ఇంటికి బాగా దగర్లొనే వుంటారు, పొద్దున్నే వెల్లి చూసివచ్చా, కాస్త ఆలిసంగా నిద్రలేచే మనిషిలా నిద్దరొతున్నారు, మనసులొ దుక్క పడ్డం , మనసులొ దండం పెట్టుకొడం అంతే. ఒకే ఒక బాలగొపాల్, చిట్ట చివరి బాలగొపాల్.

    ReplyDelete
  2. తెలుగు దేశం ప్రభుత్వం నడిపిన నరహంతక పాలనని తీవ్రంగా విమర్శించిన ఒక గొప్ప శాంతి ప్రవక్త బాలగోపాల్. Balagopal can be referred as Leo Tolstoy of Andhra Pradesh.

    ReplyDelete
  3. ఇవాళ మానవ హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం రావటం వెనుక బాలగోపాల్‌ పాత్రను మరవటం సాధ్యం కానిపని. ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్న పీడిత వర్గాలకు బాలగోపాల్‌ పెద్ద దిక్కు. గత మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో, దేశంలో చోటు చేసుకున్న ప్రతి సంక్షోభ సందర్భంలోనూ క్రియాశీలంగా స్పందించిన వ్యక్తి బాలగోపాల్‌...
    చదివింది గణిత శాస్త్రం అయినా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విశేష ప్రతిభ కనపరచిన మేధ బాలగోపాల్‌ది... సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ పేదల హక్కుల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సైద్ధాంతికంగా అరమరికలు లేకుండా నిలబడిన బాలగోపాల్‌ వంటి వారు లేని లోటు తీర్చటం దుర్లభం... ప్రజల గోడును తన గొడవగా కవిత్వంలో తీవ్ర స్వరంతో వినిపించిన వాడు కాళోజీ... ప్రజల గొంతును తన గళంగా మార్చుకుని వ్యవస్థను నిలదీసిన వాడు బాలగోపాల్‌...

    ReplyDelete
  4. may his soul rest in peace. Hope all his achievements are documented and published as a book which could act as a reference for human rights activists.

    ReplyDelete