Thursday, March 25, 2010
A classical dancer
Sunday, March 21, 2010
HDR Panorama
Sunday, March 14, 2010
HDR Photography
మనం కళ్ళతో చూడగలిగిన దృశ్యాలన్నీ కెమెరతో ఫోటో తీస్తే, ఆ ఫోటోలు చాలా సందర్భాల్లో అచ్చు మనం కళ్ళతో చూసిన దృశ్యంలాగే ఉండవు. అది ఫోటోగ్రఫి పరిమితుల్లో ఒకటి. చూస్తున్న దృశ్యంలో వెలుగు – నీడ మధ్య ఎంత వ్యత్యాసం వున్నప్పటికీ, కళ్ళు దాన్ని చూడగలవు. కళ్ళతో చూస్తున్నప్పుడు యాంత్రికంగా మనకళ్ళు మాత్రమే ‘చూడడం’లేదు. మెదడు ఆ దృశ్యం తాలుకు అనవసరమైన వివరాలని వడపోయడమే కాకుండా వెలుగు – నీడ మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నా, దాన్ని చూడగలగడానికి అవసరమైన మార్పులు స్వయంచలితంగా చేస్తుంది. అయితే అదే దృశ్యాన్ని డిజిటెల్ గానో, నెగటివ్ మీదో లేక స్లైడ్ ఫిల్మ్ మీదో బంధించాలనుకున్నప్పుడు ఆయా మాధ్యామాలకున్న పరిమితులని బట్టి అది నమోదవుతుంది.
ఒకే షాట్ లో, ఒక దృశ్యంలోని, ఎంత చీకటి-వెలుగుల వ్యాప్తిని నమోదు చేయగలము అన్నదాన్ని ఫోటోగ్రఫీలో గతివ్యాప్తి(?) (dynamic range)గా అర్ధం చేసుకోవచ్చు. ముందే అనుకున్నట్టు Dynamic Range (DR) మాధ్యమం మీద ఆధారపడి వుంటుంది. నెగటివ్ ఫిల్మ్ DR స్లైడ్ ఫిల్మ్ DR కన్న ఎక్కువ. ఫోటోగ్రఫీలో ప్రతిదాన్ని stopలో కొలుస్తారు. నెగటివ్ ఫిల్మ్ DR దాదాపు 7 stops – అంటే సరైన ఎక్సపోజర్ నుంచి మూడు స్టాప్ లు ఎక్కువ ఎక్సపోజర్ అవసరమైన నీడలన్ని పూర్తి చీకటిగాను, సరైన ఎక్సపోజర్ నుంచి మూడు స్టాప్ లు ఎక్కువ ఎక్సపోజర్ పొందిన వెలుగు అంతా వివరాలు లేని తెల్లటి వెలుగుగాను నమోదు అవుతాయి. స్లైడ్ ఫిల్మ్ DR 5 stopలే. అంటే సరైన ఎక్సపోజర్ కి అటూ ఇటు రెండు స్టాప్ ల అక్షాంశం మాత్రమే వుంది. డిజిటల్ లో కూడా స్లైడ్ ఫిల్మ్ లాగే తక్కువ DR. ఈ పరిమితివల్లే సూర్యోదయం సమయంలోను, సూర్యాస్తమయం సమయంలోను మనం కళ్ళతో చూడగలిగే చాలా రంగులు ఫోటోల్లో కనపడవు. ముఖ్యంగా మేఘాలు, భూమి రెండు కలిపి తీసిన ఫోటోలలో ఈ సమస్య ఎక్కువగా చూస్తాం.
దీన్ని అధిగమించడానికి ఫోటోగ్రఫార్లు ‘filter’లు ఉపయోగించేవారు. ప్రకృతి ఫోటోలు తీయడం వృత్తి అయిన ఫోటోగ్రాఫర్లు తప్పకుండా 1, 2, 4 stopల Graduated Neutral Density (ND grads) ఫిల్టర్లు సంచీల్లో పెట్టుకు తిరిగేవారు. ఈ ఫిల్టర్లు సగం వరకూ రంగుతోనో లేక తటస్థమైన రంగో కలిగి ఉండి మిగతా సగం మామూలుగా ఉంటాయి. ఆకాశం లేక ఎక్కువ వెలుగువుండి, తక్కువ ఎక్సపోజర్ అవసరమైన వైపు ఫిల్టర్ వచ్చేల వుంచి ఫోటో తీయడం ద్వారా కొంతవరకూ DR సరిపోకపోవడం సమస్యకి మార్గాంతరం దొరికేది. అయితే దీనికున్న ప్రధానమైన పరిమితి క్షితిజం. ఈ ఫిల్టర్లు సమాంతరమైన క్షితిజం ఉన్న దృశ్యాలకే పనికివస్తాయి – ఉ.దా. సముద్రం, ఆకాశం. డిజిటల్ ఫోటోగ్రఫీలో ఫోస్ట్ ప్రోసస్ తో ఈ పరిమితికి విరుగుడుగా ఉన్న పరిష్కారాలలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక పద్ధతి HDR (High Dynamic Range) Photography.
చాలా సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక దృశ్యాన్ని కనీసం మూడు (సరైన, -2, +2) ఎక్సపోజర్లతో ఫోటో తీసి ఆ మూడు ఫోటోలని సాఫ్ట్ వేర్ తో కలిపి ఒక ఫోటోగా చేయడం HDR Photography. మూడు ఫోటోలు తీయడం వీలుకాని పక్షంలో, ఒకే ఫోటోని మూడు ఎక్స్ పోజర్లతో మార్చి నిలువచేసి, వాటిని HDR సాధనంతో జత చేయచ్చు. దీనికి Photomatix ఒక పాపులర్ సాఫ్ట్ వేర్. ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఒక ఒపెన్ సోర్స్ సాధనం కూడా ఉంది - qtpfsgui.sourceforge.net.
ఈ క్రింది ఫోటో రెండు సంవత్సరాలక్రితం తీసింది.