Sunday, January 25, 2009

అమెరికాలో తెలుగువాళ్ళు సంతానానికి తెలుగు నేర్పడం, కొన్ని ప్రశ్నలు

నిన్న ఒక తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు జరిగాయి. అందులో భాగంగా ఆ వూళ్ళో తెలుగు బడి చదువుకుంటున్న పిల్లలతో బడి నడువుతున్న స్వచ్ఛంద సేవకులు కొన్ని కార్యక్రమాలు చేయించారు. ఆ సందర్భంలో కలిగిన సందేహాలకి ఒక టపా రాస్తే స్పష్టత వస్తుందేమోనని ఈ ప్రయత్నం.

మొదటిగా ఈ కార్యక్రమాలు చూసిన తరువాత, అందులో పాలు పంచుకున్న పిల్లల తెలుగు భాషా శక్తి చూసాకా, యింకా ఆ బడికి పిల్లలు పంపని వాళ్ళకి తమ పిల్లల్ని బడిలో చేర్చాలని అనిపిస్తుందా? అన్నది. తమ పిల్లల్ని రంగం మీద చూసుకోవడం, ప్రేక్షకుల్ని బతిమాలి, మోహమాటపెట్టీ ఆ రచ్చకి చప్పట్లు కొట్టంచడం; యివే ధ్యేయం అయితే వెంటనే ఆ బడిలో చేర్చాలనే అనిపించచ్చు. పిల్లలకి తెలుగురావడం వుద్దేశ్యమైతే యిలాంటి బల ప్రదర్శనాలు ఏమీ ఉత్తేజ పరచవు. నా పక్కన వున్నాయన్ని అదే అడిగాను.. 'మన పిల్లల ఉచ్ఛారణ యింత ఘోరంగా అఘోరించలేదే, యిందులో వాళ్ళు ఎందుకిలా వున్నారు' అని. దానికి ఆయనన్నాడు, 'మన వాళ్ళు యింకా బడికి (మామూలు బడి) వెళ్ళడం మొదలు పెట్టలేదు కనుక సవ్యమైన తెలుగే మాట్లాడుతున్నారు' అని. బహుశా అదే కావచ్చు. పిల్లలు మాములు బడికి వెళ్ళడం మొదలు పెట్టాకా, యింట్లో తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం లాంటివి క్రమంగా జరిగే వాతావరణం లేకపోతే ఆ అభ్యాసం పోతుంది. తెలుగు నేర్పడం కోసం వున్నవి స్వచ్ఛంద సేవకులు నడిపే సంస్థలు కనుక, వాటికి వున్న ఒనరులు, సమయం చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది సమయంలో చాలా భాగాం ఏడాదికి రెండు మూడు సార్లు జరగాల్సిన ఈ మొక్కుబడి కార్యక్రమాల నిర్వహణకే గడిచిపోతుంది. మరి బడి అసలు ఆదర్శం గతి?

ఈ కార్యక్రమంలోనే కాదు, చాల మటుకు యిటువంటి కార్యక్రమాల్లో ఎన్.ఆర్.ఐ నిర్వాహకులు తరచూ ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టండోయో అని బతిమాలే సందర్భాల్లో చెప్పేది - 'మేం (లేదా వాళ్ళు) - ఈ కార్యక్రమం కోసం - చాలా కష్ట పడ్డం, మీ అభినందన చూపండి' అని అడగడం. ఈ కార్యక్రమంలో ఆ మాట విని విని విసుగువచ్చి ఒక సారైతే లేచి నిలబడి 'మరీ అంత కష్టపడి మమ్మల్ని కష్టపెడ్డడం ఎందుకయ్యా, కష్టపడకు' అని అరవాలనిపించిది. మన పిల్లలకి, మన భాష మనం నేర్పడం వాళ్ళు వారానికి ఒక అరగంట టి.వి చూడకుండా - పోని wii దగ్గర ఎంజయ్ చేసేయడం త్యాగం చేసేసి - బడికి వచ్చి ఏదో నేర్చుకునే ప్రయత్నం చేయడంలో కష్టం ఒక్కటే కనిపిస్తుంటే, ఎందుకు చేయడం? ఈ ప్రయత్నంలో నేర్పేవాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి ప్రయోజనకరమైన పని చేస్తున్నమనే ఆత్మసంతృప్తి, కించత్ గర్వం కలగనప్పుడు, ఎందుకు చేయడం?

ఒక ప్రయోజనం కోసం పని చేసే వాళ్ళు చిన్న పనులని చాలా కష్టంతో సాధించామనుకోరు. ఇంకోలా చెప్పాలంటే, చిన్న పనులనే మహాకష్టమైన పనులనుకునేవాళ్ళు, పెద్ద పనులేం సాధించలేరు. అవును, మొహమాటం లేకుండా అంటాను, పిల్లలకి నాలుగు తెలుగు అక్షరాలు నేర్పడమో, నాలుగు పద్యాలు నేర్పడమో, చాలా చాలా చిన్న పనులు; వాటికి చప్పట్లు కావాలని దేబురించడంతోనే ఆగిపోతే అవి అప్రయోజనమైన పనులు కూడా.

ఈ సందర్భంలో 'కష్టం' అని మాట వాడడంలో ధ్వని 'అవసరం లేని' పని చేయడం అనా అన్నది నా అనుమానం. తెలుగు నేర్చుకోవడం ఎందుకు? ఏ భాషైనా నేర్చుకోవడం ఎందుకు? ఒక కారణం ఆ భాషలో వున్న సాహిత్యాన్ని అనుభవించడానికి. మన భాషని, అందులో వున్నా అపారమైన అమూల్యమైన కవిత్వాన్ని, కథల్ని, మనవి మాత్రమే అయిన విశేషాలని నేర్చుకోవడం, నేర్చుకున్నది పిల్లలతో పంచుకోవడం అనే వుద్దేశ్యంతో నడవలసిన సంస్థలు మొక్కుబడి కార్యక్రమాలకోసం, పిల్లల్ని స్టేజ్ ఎక్కించడంకోసం, చప్పట్ల కోసం శక్తి ఖర్చుపెట్టడం మానేయడం ఉత్తమం. దాని బదులు, ఒక డెడ్ లైన్ పెట్టుకుని కాక, అన్నీ కలసివచ్చినప్పుడే నిజంగా పిల్లల్ని, ప్రేక్షకుల్ని ఉత్తేజపరచగలిగేలాంటి సభ జన్మానికి ఒకటి నడిపినా, అదే మేలు.

- రమణ.

2 comments:

  1. మీ బ్లాగు ఈ రోజే చూస్తున్నా. మీ పోస్టల్ చిరునామా, ఫోన్ నంబర్, మీరు నివసిస్తున్న ఊరు పేరుతో ఒక జాబు రాయగలరు; అమెరికా బ్లాగర్ల డేటా బాంక్ కోసం. ధన్యవాదాలు.
    cbraoin at gmail.com

    ReplyDelete