Thursday, February 12, 2009

“ఓ మహాత్మా! ఓ మహర్షి! ఏది నలుపు ఏది తెలుపు”

మేం ఉంటున్న ఊళ్ళో ఐదు ఇండియన్ రెస్టరెంట్లు వుండేవి. క్రిందటి వారం ఒక రెస్టరెంట్ ముందు ‘మరమ్మత్తుల కోసం మూయబడింది’ అని బోర్డు కనబడింది. నిన్న పేపర్లలో దాని యజమానిని పోలీసులు అరెస్టు చేసారన్న వార్త వచ్చింది. అతను 6 సంవత్సరాల క్రితం, ఓడలో వంటవాడిగా పనిచేస్తుండగా, పడవ ఆమెరికా తీరం చేరినప్పుడు దేశంలో ప్రవేశించి, గడువు ముగిసినా తిరిగివెళ్ళలేదు. ఆ తరువాత తప్పుడు సాక్ష్యాలతో మత శ్రామికులకి యిచ్చే కోటాలో పచ్చకార్డు సంపాదించి యిక్కడే వుండి పోయాడు. ఇప్పుడు అతని వయసు 29 సంవత్సరాలు. మూడు సంవత్సరాల క్రితం యింకో వ్యక్తితో కలసి, రెస్టరెంట్ పెట్టాడు. మంచి వంటవాడు, మాటకారి, కష్టపడి పనిచేసే మనిషి. పెద్ద పెద్ద ఆశలు ఉన్నవాడు. వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు కానీ అక్కడి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు చూసి వుండచ్చు.

అతన్ని అరెస్టు చేయడానికి యింకో కారణ కూడా వుంది. అది, తన హోటల్లో కాగితాలు లేని నలుగులు - గంటమోల, హోండురస్, మెక్సికో దేశాలనుంచి వచ్చిన - వ్యక్తులని పనిలో పెట్టుకోవడం. వాళ్ళు ఈ దేశంలో చట్ట ప్రకారం వాళ్ళు పనిచేయకూడదని అతనికి తెలుసు. వారానికి ఆరురోజులు పనిచేసే వారని, వాళ్ళకి వసతి, తిండి యివ్వడంతో పాటు రెండు వారాలకి 600 చప్పున డబ్బు చెల్లించే వాడినని పోలీసుల దగ్గర అతనే ఒప్పుకున్నాడు. కొంత జరుమానా విధించి డిపోర్ట చేయడంతో సరిపెట్టాలనే కోరికతో నేరాల్ని స్వయంగా అంగీకరించేట్టు అతని న్యాయవాదులు సలహా యిచ్చినట్టు సమాచారం.ఈ విషయం విన్నప్పుడు ‘పాపం దురదృష్టవంతుడు’ అన్న భావనే కలిగింది కానీ అతను చట్టాన్ని అతిక్రమించాడననీ, నేరస్తుడనీ, శిక్షార్హుడనీ ప్రతికూల భావం ఏర్పడ లేదు నాలో. నేను ఈ విషయం కొంతమంది సహోద్యోగుల దగ్గర ప్రస్తావించాను. వాళ్ళు ఎవరూ కూడా ‘తగిన శాస్తి జరిగింది వాడికి’ అనలేదు. అందరూ విచారం వెలిబుచ్చిన వారే. కానీ, ఈ వార్త వచ్చిన పేపర్లో వార్తకింద 200 పైగా కామెంట్ లు వున్నాయి. దాదాపు అన్నీ ద్వేషపూరితమైన రాతలే.

ఈ మాదిరి కాగితాలు లేకుండా, తప్పుడు కాగితాలతో, వున్నవాళ్ళు అమెరికాలో కొన్ని లక్షలమంది వుంటారు. అలాంటి వాళ్ళందర్ని నేరస్తులుగా పరిగణించాలనీ, వేటాడి దేశం నుంచి బయటకు తోలాలన్నది ఒక పక్షం వాదం. అలా చేయడం వీలుకాని పని అనీ, అలాంటి వాళ్ళకి కొంత జరుమాన విధించి వాళ్ళు చట్టబద్దమైన పౌరులుగా మారగలిగే అవకాశం కలిగేలా చట్టాన్ని మార్చడం మానవీయమైన చర్య మాత్రమే కాక, దేశం ఆర్ధిక పురోగతికి కూడా అవసరం అన్నది యింకో పక్షంవాదం. గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది CIR (Comprehensive Immegration Reform) గురించి చర్చలు జరిగాయి కానీ, అది చట్టరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఆ మార్పులు జరిగే అవకాశం తక్కువే.

కొంచెం మంచి బతుకుకోసం సాహసం చేసి, చట్ట అతిక్రమణ చేసిన మనుషుల పట్ల ఇతరులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు అన్నది వారి వారి ప్రస్తుత జీవన పరిస్ధితుల మీద కూడా ఆధారపడి వుంటుంది. ఈ ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య లేకపోతే మెజారిటీ ప్రజలకి ఇలాంటి అతిక్రమణలు చేసిన మనుషుల పట్ల అంత ద్వేషం కలుగకపోవచ్చు. ఈ అనిశ్చిత స్పష్టమైన పరిష్కారం యింకా కనబడని నిరాశకరంగా వున్న ప్రస్తుత పరిస్థితి వల్ల పరదేశీయుల మీద ద్వేషం వల్ల జరిగే నేరాలు పెరిగే రోజులు రావనే భావిస్తాను.

ఈ అరెస్టు జరిగిన రోజే టైమ్స్ లో H1B మీద ప్రభుత్వం విధించిన పరిమితులని విమర్శిస్తూ, ఓపెన్ ఎడిటోరిల్లో ఫ్రైడ్ మాన్ “we need to attack this financial crisis with green cards not just greenbacks, and with start-ups not just bailouts.” అని రాయడం కాకతాళీయమే. అమెరికా నాయకులూ, ప్రజలూ ‘గోడల్ని బద్దల కొట్టకుండా’ ఈ సంక్షోభం పరిష్కారం కాదని తోందర్లోనే గ్రహిస్తారని ఆశిద్దాం.

“నేటి ఛేదం రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి! ఓ మహాత్మా”
-శ్రీశ్రీ

No comments:

Post a Comment