Thursday, February 26, 2009

స్లమ్ డాగూ- బాబీ జిందాలూ

మంగళవారం ఒబమా జాయింట్ కాంగ్రెస్ ఉపన్యాసానికి స్పందిస్తూ, రిపబ్లికిన్ పార్టీ ప్రతినిధిగా భారతీయ సంతతికి చెందిన లూయిసియానా గవర్నర్ బాబి జిందాల్ మాట్లాడారు. నాలుగు సంవత్సరాల తరవాత జరగబోయే అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ఆయన ఎంపికయ్యే అయ్యే అవకాశాలు వున్నాయాని కొందరు ఊహాగానాలు చేస్తున్న నేపథ్యం ఆయన స్పందనకి కొంత విలువ కలిగించింది. తనూ, రిపబ్లికన్లు ప్రభుత్వ పాత్రని పెంచే ఒబామా ప్రతిపాదనలని వ్యతిరేకిస్తున్నామని చెప్తూ, ప్రభుత్వం ‘అగ్ని పర్వతాల పర్యవేక్షణకి’ వెచ్చిస్తున్న 140 మిలియన్ల ఖర్చుని వృధా వ్యయంగా వేళకోళం చేసారు జిందాల్. తన తల్లిదండ్రులూ అమెరికాకి వలస వచ్చిన కష్టజీవులే అన్నారు. ఆ సందర్భంలో తన గురించి ఒక పిట్టకథ చెప్పారు. ‘..నా చిన్నతనంలో నా తండ్రితో కలిసి పచారి కొట్టుకువెళ్ళిన జ్ఞాపకం నాకుంది. ఇండియాలో పెరుగుతున్నప్పుడు దుర్భరమైన దారిద్ర్యాన్ని చూసిన ఆయన, మేము ఆ కొట్టు అరల మధ్య నడుస్తుండగా, వాటిల్లో అనంతగా వున్న రకరకాల వస్తువులని చూస్తూ నాతో చెప్పేవాడు.. ‘’బాబీ, అమెరికన్లు ఏమైనా చేయగలరు’’. నేను ఈరోజుకి దాన్ని నమ్ముతాను.’ అని.

మన జాతి వాడు, దేశం వాడు, కిందనించి వచ్చిన వాడు అమెరికాలో ఒక రాష్ర్టానికి గవర్నర్ అని గర్వపడాలా? రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాల్లో అన్నీ అభివృద్ధి నిరోధక భావాలే కల బాబీ జిందాల్, మన జాతి రాజకీయ నాయకత్వ విజయానికి ప్రతినిధి కనక సిగ్గుపడాలా? గుల్జార్, రెహమాన్, రెసూల్ లకి ఆస్కార్లు వచ్చాయని గంతులెయ్యాలా? అవి స్లమ్ డాగ్ కి అయినందుకు కించపడాలా?

షారుక్ ఖాన్ సినిమా డైలాగొకటుంది ‘కభీ కభీ కుచ్ జీత్ నికి లియే కుచ్ హార్నా పడ్తాహై, ఔర్ హార్ కర్ జీత్నే వాలేకో బాజీగర్ కెహెతే హై’. జూదంలో గెలవడమూ గెలవడమే. అందులో గెలుపుకైనా ప్రతిభా, అదృష్టం / కాలం కలిసి రావాలి. అన్నీ అమరినప్పుడు కూడా పడెయ్యాల్సిన ముక్క పడయ్యకుండా, కావల్సిన ముక్క తీసుకోలేం. ఒకోసారి పడేసినా తీసుకోలేం. ఇంకోసారి తీసుకున్నది పనికిరాకుండా పోవచ్చు. పారేసిందే తెచ్చుకున్నదానికన్నా విలువైనదని గ్రహించేసరేకే యింకోళ్ళు మన ఆట కట్టించేయచ్చు. అటన్నాకా గెలవడం ఓడడం రెండూ వుంటాయి. మనవాళ్ళు గెలిచినప్పుడు సంతోషపడాల్సిందే, కానీ గెలిచారు కనుక, జూదర్లని భుజాల కెక్కించుకోనక్కర్లేదు.

గాంధీ గోచి పెట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఎవరూ ఆయన్ని మనదేశ దరిద్రాన్ని ప్రపంచానికి ప్రదర్శించి మనపరువు తీస్తున్నాడనలేదు. అప్పటి మన దారిద్ర్యానికి పరపలన కారణంగా చూపించ దలుచుకున్నం కనుక ఆయన వైఖరి బ్రిటిష్ పాలనలో మన దేశ ప్రజల దైన్యాన్ని ప్రపంచంముందు నిలబట్టిన సాహసంగానే కనబడింది. ఇప్పుడు స్లమ్ డాగ్ ని విమర్శించే వాళ్ళు కొందరైన లేవదిస్తున్న అభ్యంతరం ఆ సినిమా మన దరిద్రాన్ని ప్రపంచానికి చూపడం కాదు, మన దరిద్రాన్ని పరాయివాడు, పరాయివాళ్ళని ‘కదిలించడం’ కోసం చూపించడాన్ని. ఆ ప్రయత్నం ఎందుకోసం చేసారన్నదాన్ని. ‘అందమైన అబద్ధంలో కన్నా నిష్టురమైన నిజంలోనే మంచి కవిత్వం (కళ) దర్శనీయం అవుతుంది’ అన్న శ్రీశ్రీ మాటల్తో పూర్తిగా ఏకీభవించే వాళ్ళకూడా స్లమ్ డాగ్ ని యిష్టపడకపోవచ్చు. అందులో వున్న నిష్టురత నిజాన్ని చెప్పాలన్న ఆదర్శం వల్ల వచ్చింది కాదన్నది అందులో వున్న అందమైన అబద్ధాలని చూసే చెప్పచ్చు.

మనవాళ్ళకొచ్చిన ఆస్కార్లకైతే నాకు చాలా సంతోషం. కానీ స్లమ్ డాగ్ ని గొప్ప సినిమా అనో కనీసం పదికాలాలు గుర్తుండే సినిమా అనో అంగీకరించడానికి కూడా నాకైతే పరిమితులున్నాయి. ఒకసారి చూడడానికి కష్టపడాల్సన సినిమాని క్లాసిక్ గా ఆస్కార్ల వల్ల అంగీకరించేంత విశాల హృదయం నాకు లేదని ఒప్పేసుకుంటాను. అలాగే, ప్రధానంగా అమెరికా ప్రభుత్వం విధానాల లోపాల వల్ల ఏర్పడిన ఈ ఆర్ధిక సంక్షోభం మధ్యలో నిలబడి, సిద్ధంతపరమైన నమ్మకాలవల్లో, సొంతలాభం కోసమో ‘(ప్రభుత్వం ప్రమేయం లేకుండానే) అమెరికన్లు ఏమైనా చేయగలరు‘ అన్న బాబీ జిందాల్ ని నాయకుడి వేషంలో సహించనూలేను.

మాంద్యం వల్లేకాదు, ఈ పరిమితుల వల్లకూడా రెండు చప్పట్లు తప్ప, ఆర్భాటాలు అవసరంలేని ‘మన వాళ్ళ’ విజాయాలివి.

2 comments:

  1. అసలు బాబీ జిందాల్ గురించి చెప్పేటపుడు "మన" ఎందుకు వస్తుంది? For God's sake he is an AMERICAN. There is nothing we should be proud of HIM. He did NOTHING to India. we have a millions of people who did more than him to India and look at them if needed.

    ReplyDelete
  2. ఒబామా కు కొంత సమయమివ్వవద్దా; తను తలపెట్టిన సంస్కరణలు అమలు చేసేందుకు. విమర్శకు అప్పుడే తొందరెందుకు?

    ReplyDelete