Friday, December 18, 2009
One High ISO shot with 40D
Tuesday, December 15, 2009
Tuesday, December 1, 2009
ఉత్తరకుమారీయం
‘నర్తనశాల’లో రంగారావు, సావిత్రి, రామారావూ ఉన్నా, ఆ సినిమాలో వాళ్ళందర్ని మించి మార్కులు కొట్టినవాడు రేలంగే. ఉత్తరకుమారుడి పాత్రలో, తనకు ఏమాత్రం సాధ్యంకావని తెలిసీ, ప్రతిజ్ఞలు చేయడంలో, సోదరితో శతృరక్తంలో జలకాలాడతానని పద్యాలుపాడి యుద్ధరంగలోకి రాగనే తన బట్టలు తనే తడుపుకోడంలో, ఎవరి దయవల్లో సాధించిన విజయ చిహ్నాలని తనవిగా చాటుకోవడంలో రేలంగి ప్రదర్శించిన నటన చూసినవాళ్ళకి ఆ సన్నివేశాలు గుర్తుకొచ్చినప్పుడల్లా పట్టలేనంత నవ్వోస్తుంది. అన్నగారు కూడా ఉన్నారు కనుక గోరక్షణకేం ఢోకాలేదని ప్రేక్షకులకి ముందే అర్ధమయిపోయి మరీ రేలంగి డంబాలు కవ్విస్తాయి. ఎలాగోలాగా యద్ధంలోకంటూ అడుగుపెడితే అర్జునుడు దొరక్కపోతాడా అన్న అత్యాశతో కె.సి.ఆర్. వెంట ‘చచ్చుడో వచ్చుడో’ అంటూ అమాయకంగా దూకిన వారిలో ఓ నలుగురి మరణంతో ఈ ప్రహసనం విషాదాంతంగా మారుతోంది.
ఈ ‘ఉద్యమం’ ప్రారంభానికి ఒకరోజు ముందు ఒక టి.వి. ఛానల్ ఎన్నారైలని ఇంటర్వ్యూ చేసి మీరు ఎలాంటి సాయం చేస్తారని అడిగితే, వారు ‘ఎంత డబ్బు అవసరమైనా పంపిస్తాం’ అని చెప్పారు. బ్లాక్ ఫ్రైడే సూపర్ డీల్స్ కొని మిగుల్చుకున్న నాలుగురూకలు షేర్లుకొనేకంటే కె.సి.ఆర్. గుడ్ విల్ షేర్లకి పెట్టుబడి పెట్టడం లాభదాయకమని వారు భావించి ఉండవచ్చు.
‘పొద్దుగూకుల ఈగలుదోలుతా ఆ టి.వి. ముంగల కూసునేకంటే జర బజారు దిక్కు పోయి రారాదే’ అన్నమాట తప్పించుకోవడానికో, ఉచిత ఇడ్లీల రుచి మరిదేనికి రాదన్న తత్వం తెలిసో కొందరు తెలంగాణా ‘మేధావు’లు కె.సి.ఆర్. వెంట ఉండచ్చు. ఎదో జరుగుతుందని, యిది సరైనా పద్ధతనీ కాదుకానీ, అదృష్టం కలిసొచ్చి జాక్ పాటేకొట్టిసి, ప్రత్యేకరాష్ర్టమే వచ్చేస్తే, తీరాచేసి ఈ టైంలో మనం రోడ్డుమీద ఉండకపోతే తర్వాత పైరవీలు చేయడానికి అవకాశాలు తగ్గపోతాయేమోనని ముందుచూపుతో ఆయన వెనక చేరిన ‘ఉద్యమకారులు’ కొందరు ఉండిఉండచ్చు.
కె.సి.ఆర్.కికానీ, యిప్పటికే ఈ పేరుచెప్పుకుని లాభాలపొందిన వాళ్ళు, యికముందు పొందబోయేవాళ్ళు ఎవరికీ ఏమీ నష్టం జరగలేదు. జరగదు. కానీ, తెలంగాణ వచ్చిన రాకపోయినా వారి జీవితాల్లో గొప్ప మార్పులు ఏమీ జరగగలిగిన ఆస్కారం లేని ముగ్గురు – భూక్యా ప్రవీణ్ (24), ఉగునూరు శ్రీకాంత్ (17), దండిక పృధ్విరాజ్ (22) – యిప్పటికే మరణించారు. ఇంకా అలాంటి ఎన్ని వందల అమాయకుల చావుకు కారణం కానున్నారో ఈ ఉత్తరకుమారులు.
Thursday, October 8, 2009
బాలగోపాల్
“యాత్రాపథంలో సైన్ పోస్ట్ కూలిపోయింది”
తెలుగుదేశంలో మేధావులంతా కుడినుంచి ఎడం నుంచి తమ పంచెలుడిపోతున్న స్పృహ కూడా నశించి కోలాహలంతో ఒక రాజు గారి మరణానికి నివాళులర్పించడానికి పోటిపడుతున్న రోజుల్లోనే వాళ్ళకి మైళ్ళ దూరంలో చేతులు పైకిముడిచిన ఉప్పు చారాల చొక్కాతో నిలబడి, రంపచోడవరం ఎజెన్సీ ఏరియాలో మలేరియాతో మరణిస్తున్న పేద వాళ్ళ నిత్యమరణానికి నివాళి రాసిన ఒకే ఒక తెలుగు మేధావి యింత అర్ధాంతరంగా వెళ్ళిపోయాడన్న నిజం మింగుడు పడట్లేదు.
బాలగోపాల్ లేని హైదరాబాద్ ని ఆంధ్రాని ఊహించలేను. ఇండియా తిరిగివెళ్ళిపోవాలని, నేనే కాదు నా మిత్రుల చాలామంది వేసుకున్న ప్రణాళికలన్నీ ఆయన చుట్టూ కట్టుకున్నవే. ప్రకాష్ కైతే ఇండియా వెళ్ళడం బాలగోపాల్ తో కలిసి తిరగడానికే. నాలుగైదు నెలలు బాలగోపాల్ తో తిరిగొచ్చి ఆ కథలతో మమ్మల్ని ఊరించేవాడు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనిపించేది మాకు. ఏ విషయం గురించి చర్చించినా బాలగోపాల్ ప్రస్తావన లేకుండా ఉండనే ఉండదు. రోజు కనీసం ఒకసారైనా ఏదో సందర్భంలో తలుచుకునే వ్యక్తి బాలగోపాల్. సైన్ పోస్టేకాదు, గీటురాయి, ఆఖరి మాట చెప్పగలిగే వ్యక్తి ఆయన.
కొంచెం శ్రద్ధ తన ఆరోగ్యం మీదకూడ పెట్టినట్టయితే, యికో ముఫై నలభై సంవత్సరాలు గొప్ప కృషి చేయగల వ్యక్తి హఠాత్తుగా నిష్ర్కమించడం గుండెల్నిపిండేస్తోంది. ఆయన రాస్తారని ఎదురుచూస్తున్న పుస్తకాలు రాసేవాళ్ళూ, ఆయన్ని అడగాలనుకున్న ప్రశ్నలకి సమాధానాలు యివ్వగలిగే వాళ్ళు మనకింకెవ్వరూ లేరు. మళ్ళీ యిలాంటి నిష్కామయోగిని ఈ జీవితకాలంలో చూడలేకపోవచ్చు. పది పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఏదో సందర్భంలో వీర నాస్తికుడు మనోహరన్ (పి.యు.సి.ఎల్) బాలగోపాల్ గురించి ప్రైవేటు సంభాషణలో మాట్లాడుతూ “Balagopal is a saint” అన్నాడు. ప్రకాషే చెప్పాడు, ఈ మధ్య బాలగోపాల్ మద్రాస్ వెళ్తే తీవ్ర అనారోగ్యంతో ఉన్న మనోహర్ ఆయన్ని చూడ్డానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడుట. బాలగోపాల్ ఆయన్ని ‘యింత అనారోగ్యంతో నువ్వెందుకొచ్చావయ్యా, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా’ అన్నాట్ట. దానికి మనోహరన్ ‘బాలగోపాల్ నువ్వు పేదవాళ్ళకి దేవుడిచ్చిన వరానివి. నిన్ను చూడ్డానికి నేను రావాలి కాని నువ్వు రావడమేమిటి’ అన్నాట్టా.
రోజుకి పదహారు పద్దెనిమిదిగంటలు పనిచేసేవాళ్ళూ, మేధావులు, గొప్పగా మాట్లాడగలిగేవాళ్ళూ, రాయగలిగేవాళ్ళు కొన్ని వేలమందే ఆంధ్రదేశంలో వుండచ్చు. కానీ బాలగోపాల్ లాగా ఆశక్తులన్ని నమ్మిన ఆదర్శాలకే బేషరతుగా వినియోగించగలిగేవారు చాలా చాలా అరుదుగా తారసపడతారు. ఆయన మీద హీరో వర్షిప్ తో పొడుగు చేతుల చొక్కాని పైకి మడమడమైతే అనుకరించగలిగాం కానీ ఆయన సుగుణాలలో ఏ ఒక్కటీ యింకా అలవర్చుకోనేలేదు. ఆయనే వెళ్ళిపోయాకా అవి నేర్చుకోగలుగుతామన్నా ఆశా కూడా యింకలేదు.
కె. బాలగోపాల్ ఆకస్మిక మరణం
ఇప్పుడే ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ లో మానవ హక్కుల నేత కె. బాలగోపాల్ నిన్న రాత్రి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించినట్ట వార్త వచ్చింది.
బాలగోపాల్ మరణం రాష్ర్టంలోనూ, దేశంలోను పౌరహక్కుల ఉద్యమాలకే కాక ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణకీ తీరని లేటు.
వివరాలు యిక్కడ.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/oct/8new78
Tuesday, July 21, 2009
Single off-camera flash in auto mode
550 EX mounted on a light stand with 32" translucent white umbrella. Auto mode.
On camera ST-E2 triggered off camera flash.
Even when the camera is in manual mode, flash is still auto flash. Since I knew flash light is going to take care of exposing the subjects properly, I chose maximum aperture my lens allowed – f4 – and choose 1/80, as that is longest time I thought I would be able to hand hold my non IS lens without causing shake.
Thursday, July 2, 2009
Saturday, June 27, 2009
1948లో పశ్చిమ పంజాబ్ నుంచి తూర్పు పంజాబ్ తరలి వచ్చిన రైతు శరణార్ధుల పునరావాశం
[దేశ విభజన తరువాత] పశ్చిమ పంజాబ్ [పాకిస్థాన్] లో హిందువులు, సిక్కులు వదిలి వచ్చినది [సాగుభూమి] 2.7 మిలియన్ల హెక్టార్లు కాగా, తూర్పు పంజాబ్ [భారతదేశం] లో ముస్లింలు వదలి వెళ్ళినది 1.9 మిలియన్ల హెక్టార్లు మాత్రమే. పశ్చిమ ప్రాంతలో నేల చాలా సారవంతమైనదీ, సమృద్ధిగల నీటి పారుదల వున్నదీ కావడం ఈ కొరత తీవ్రతని అధికం చేసింది. [...]
మొదటిగా ప్రతి శరణార్ధి కుటుంబానికి - పాకిస్తాన్ లో వాళ్ళ వాటా ఎంతా అన్న ప్రశ్న లేకుండా – నాలుగు హెక్టార్లు కేటాయించడం జరిగింది. విత్తులు, పరికరాలు కొనుగోలుకోసం ముందస్తుగా రుణాలు జారీ అయ్యాయి. తాత్కాలికంగా యిచ్చిన భూభాగంలో సాగుపనులు జరుగుతున్నప్పుడే, శాశ్వతమైన కేటాయింపులకై దరఖాస్తులుకోసం పిలుపు యిచ్చారు. ప్రతి కుటుంబాన్ని. తాము ఎంత భూమి వదిలి వచ్చేరో ఆధారాలు సమర్పించవలసిందని కోరారు. 10 మార్చి 1948 నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టారు; ఒక నెల రోజుల లోపే 500,000 వాజ్యా (claim)లు దాఖలయ్యాయి. తరవాత, అదే గ్రామం నుంచి వచ్చిన శరణార్ధులు వున్న బహిరంగ కూటమిలలో ప్రతి వాజ్యాన్ని సరిచూడడం జరిగింది. ఒక ప్రభుత్వ అధికారి ప్రతి వాజ్యాన్ని పైకి చదువగా, కూటమి దాన్ని అంగీకరించడమో, మార్చడమో లేక నిరాకరించడమో చేసేది.
అనుకున్నట్టుగానే చాలామంది శరణార్ధులు [వదిలి వచ్చిన దాన్ని] కొంత ఎక్కువ చేసి చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు. అయితే, ప్రతి తప్పు వాజ్యం శిక్షించబడిది – ఆ శిక్ష కొన్నిసార్లు కేయించిన భూమిని తగ్గించడం, కొన్ని తీవ్రమైన సంఘటనలలో స్వల్ప ఖైదు. దీని వల్ల చాలా వరకూ నిరోధన జరిగినా; ఈ మొత్తం వ్యవహారంలో సన్నిహితంగా పాలుపంచుకున్న ఒక అధికారి అంచనా ప్రకారం మొత్తం మీద 25% పెంచి చెప్పడం జరిగింది. వాజ్యాలని పోగుజేయడానికి, సంప్రదించడానికి, సరిచూడడానికి, చర్య తీసుకోవాడానికి గాను ఒక పునరావాశ సచివాలయం జలంధర్ లో ఏర్పాటు అయ్యింది. అది ఉచ్ఛస్థాయిలో వున్నరోజుల్లో అక్కడ 7000 మంది అధికారులు పనిచేశేవారు. ఒక మాదిరి శరణార్ధుల నగరాన్ని వారంతట వారే స్థాపించారు. చాలామంది అధికారులు డేరాల్లో సర్దుకున్నారు. నాసిరకమైన దీపాలు, లంతర్లలో తాత్కలికంగా హిందువులకోసం ప్రార్ధానాస్థలాలు, గుళ్ళూ, సిక్కుల కోసం గురుద్వారాలతో పనిచేశారు.
ఈ కార్య నిర్వహణకి నేతృత్వం పునరావాసం డైరక్టర్ జెనరల్, భారతీయ సివిల్ సర్వీసస్ అధికారి, సర్దార్ తారాలోక్ సింగ్. వీరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పట్టభద్రులు. శరణార్ధుల స్థిరనివాసం విజయవంతం అవడానికి కీలకమైనవని రుజువైన రెండు కొత్త కల్పనలు చేయడానికి తారాలోక్ సింగ్ తన విద్యా శిక్షణని సమర్ధవంతగా వినియోగించారు. ఆ రెండూ ‘ప్రామాణికమైన ఎకరం’ (standard acre), ‘శ్రేణికి తగ్గ కోత’ (graded cut) అన్నవి.
పదినుంచి పదకొండు మాండుల (దాదాపు 40 కిలోలు ఒక మాండు) దిగుమతి యివ్వడానికి ఎంత భూమి అవసరమో దాన్ని ప్రామాణికమైన ఎకరంగా నిర్వచించారు. సాగు సౌకర్యంలేని, బీడు భూమి గల తూర్పు జిల్లాల్లో నాలుగు భౌతికమైన ఎకరాలు ఒక ప్రామాణికమైన ఎకరంతో సమానం. కోమలమైన ‘కాలువ ప్రాంతాల’లో ఒక భౌతిక ఎకరం ఒక ప్రామాణికమైన ఎకరంతో సమానం. ప్రామాణిక ఎకరం అనే భావనతో పరగణాల్లో వున్న నేల, వాతావరణం వంటి వ్యత్యాసాల ప్రభావానికి పరిష్కారం జరిగింది.
మరోవైపు, శ్రేణికి తగ్గ కోత అన్న భావన శరణార్ధులు వదిలి వచ్చిన భూమికి, వారికి లభిస్తున్న భూమికి వున్న లోటు – దాదాపు మిలియన్ ఎకరాల లోటు – ని అధిగమించడానికి ఉపయోగపడింది. మొదటి 10 ఎకరాల వాజ్యానికి 25% శాతం కోత విధించబడింది – దానితో వారికి 10 ఎకరాల బదులు 7.5 ఎకరాలు లభించింది. ఎక్కవ వాజ్యాలకి కోత ఎక్కువ; 10 నుంచి 30 ఎకరాలకి కోత 30% అలా పెంచి 500 ఎకరాల కన్న ఎక్కువ వున్న వారికి 95% సుంకం విధించారు. వ్యక్తిగతంగా అందరికన్న ఎక్కువ కోల్పోయిన ఒక వ్యక్తి విద్యావతి అని పేరు గల స్త్రీ. ఆమె వారసత్వంగా భర్తనుంచి పొందిన, (తరువాత పోగొట్టుకున్న) 11,500 ఎకరాల సంస్థానం గుజరన్ వాలా, సైల్ కోట్ జిల్లాలలో ముఫైఐదు గ్రామాల వరకూ విస్తరణగలది. దానికి ప్రతిఫలంగా ఆమెకి కేటాయించబడింది కర్నాల్ అనే ఓకే గ్రామంలో వున్న అతికొద్ది 835 ఎకరాలే.
1949 నవంబరు నాటికి తారాలోక్ సింగూ ఆయన అధికారులూ 250,000 భూమి కేటాయింపులు చేసారు. ఈ శరణార్ధులందరూ న్యాయబద్ధంగా మొత్తం తూర్పు పంజాబు జిల్లాలోకి తరలించబడ్డారు. మొత్తం గ్రామ సముదాయాలని పున: సృష్టించడం అసాధ్యమని రుజువైనా పూర్వపు యిరుగుపొరుగులూ, కుటుంబాలూ ఒకేచోట మళ్ళీ స్థిరపడ్డారు. శరణార్ధులకి వారికి లభించిన కేటాయింపుల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం యిచ్చారు. దాదాపు 100,000 కుటుంబాలు పున: సమీక్ష కోరాయి. అందులో మూడోవంతు అభ్యంతరాల మీద చర్య తీసుకున్నారు, దాని ఫలితంగా 80,000 హెక్టార్లు చేతులు మారాయి.
పడమరలో మంచి నీటి సదుపాయం వున్న తమ భూములకి బదులుగా ఈ శరణార్ధులకి తూర్పులోని వట్టిపోయిన ఆస్తులు యిచ్చారు. శ్రేణికి తగ్గ కోత వల్ల వాళ్ళకి పోగొట్టుకున్నదానికన్నా తక్కువే దొరికింది. అయినా, వారికి స్వభావసిద్ధమైన చాతుర్యం, పరిశ్రమ వల్ల వారు పనిలో దిగారు, కొత్త నూతులు తవ్వారు, కొత్త యిళ్ళు కట్టారు, పంటలు నాటారు. నిర్జీవమైన గ్రామసీమల్లో 1950 నాటికి మళ్ళీ జీవం వచ్చింది.
[ఆంధ్రా సెజ్ విషయంలో రైతుల భూమికి పరిహారంగా నగదు యిచ్చి ప్రభుత్వాలు చేతుల కడుక్కోగలగడానికి కారణం దేశంలో 40, 50 దశాబ్దాలలో వున్న ఆదర్శాలు యిప్పుడు లేకపోవడమా? (అను.)]
[Excerpt from ‘India After Gandhi’ - Rama Chandra Guha, (First Harper Perennial edition published 2008). Pages 99 and 100]
Sunday, May 17, 2009
ఎన్నికల ఫలితాలు
ఈ ఎన్నికల ఫలితంగా రాష్ర్టంలో మొదటి సారిగా హంగ్ ఏర్పడే అవకాశం, దేశంలో అద్వాని ప్రధాని అయ్యే అవకాశం వుందన్న అంచలనాని తలక్రిందలు చేస్తూ కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ స్వంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో వుండడం అద్వాని అభిమానులకూ, అలాగే, తెలంగాణా వాదులకూ మింగలేని పరిణామం. ఓట్ల లెక్కింపుకు ముందు ఛాట్ లో ఓ తెలంగాణా వాదిని ‘ఫలితాలు ఎలా వుంటాయని నీ అంచనా’ అంటే, అతను ‘కేంద్రంలో బి.జె.పి రావాలే’ అని కోరిక వెలిబుచ్చాడు. కేంద్రంలో బి.జె.పి అధికారంలో వస్తే తెలంగాణా వంద రోజుల్లో యిచ్చేస్తారని నమ్మినా, అద్వాని, మోడీల నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పడితే మాంద్యం నేపథ్యంలో బి.జె.పి - కాలం చెల్లిన - నియో లిబరల్ ఆర్ధిక విధానాల వల్ల దేశానికి ఎంత నష్టమో అన్న భయం కానీ, టెర్రరిజం బూచి పేరుతో మైనారటీల మీద ఎలాంటి నిర్బంధాలు జరుగుతాయో అన్న ఆందోళన కానీ టి.ఆర్.ఎస్ ని, తెలంగాణా వాదులని బి.జె.పి పంచన చేరకుండా ఆపలేకపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైనది ఏమైనా చేస్తామన్న దృష్టితో సాగుతున్న పరిమిత ఆచరణకనుక దీన్ని ‘తెలంగాణా వాద’ మనే అనాలి కాని ఉద్యమం అనలేం. నావరకైతే చాలా ఆనందం కలిగించిన ఫలితాలు, ఒకటి, టి.ఆర్.ఎస్. ఘోరపరాజయం, రెండు, అద్వాని రాజకీయ జీవితానికి దాదాపు ఆఖరి ఎన్నికలాంటి ఎన్నికలో బి.జె.పి. ఓటమి, మూడు అల్లు అరవింద్ మట్టి కరవడం.
ఈ ఎన్నికలలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ జరిగింది. ఓటర్లలో చాలామంది వయసు ముఫైలలోపు. మళ్ళీ ఐదు సంవత్సరాలలోపు ఎన్నికలు జరిగే అవకాశం లేని విధంగా ప్రజలు తీర్పు యిచ్చారు. ఓడించిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో అర్ధం అవుతున్నంత స్పష్టంగా గెలిచిన వాళ్ళు ఎందుకు గెలిచారో తెలియడం లేదు. రాష్టంలో ప్రజలు కాంగ్రెస్ ని తిరిగి ఎన్నుకున్నారంటే ‘రాజశేఖరుడి మీద మోజు తీర’కా? లేక బరిలో ఉన్న యితరుల కన్నా ఆయనకే ఎక్కువ విశ్వసనీయత వుందని భావించారా? లేక అంత కన్నా యోగ్యత వున్న యితర పార్టీల వారికి – ప్ర.రా.పా, లోక్ సత్తా – యింకా సరైన నిర్మాణం లేకనా? ప్ర.రా.ప. మీద ప్రజలకి గణనీయమైన విశ్వాసం లేదనడానికి చిరంజీవి ఓటమి, అల్లు అరవింద ఓటమి సాక్ష్యంగా చూపచ్చు. లోక్ సత్తా జయప్రకాష్ గెలవడం చాలా సంతోషమైన విషయం. రామచంద్ర గుహ అవుట్ లుక్ లో ఎన్నికల గురించి రాసిన వ్యాసంలో భవిష్యత్తు ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా లోక్ సత్తాలంటి పార్టీలు రూపుదిద్దుకుంటాయని చెప్పిన జోస్యం సరైనదనడానికి యిది ఒక సూచనగా తీసుకోవచ్చు.
చిరంజీవి పార్టీ పెట్టినప్పటినుంచి ఎన్.టి.ఆర్. లాగా మొదటి ఎన్నికలలోనే అధికారం సంపాదిస్తామని ధీమాగా చెప్పారు. తరువాత జరిగిన పరిణామాలు ఆ నమ్మకం కలిగించలేదు. వ్యక్తిగతంగా చిరంజీవి ఎన్.టి.ఆర్. లాంటి వక్తకాకపోవడం, ప్ర.రా.పకి సొంత పేపరు, ఛానల్ లేకపోవడం మాత్రమే వారి భంగపాటుకి కారణమని నేను భావించను. ఎన్.టి.ఆర్. విజయానికి కారణమైన బలమైన చారిత్రక శక్తి, జస్టిస్ పార్టీలాంటి బ్రాహ్మణ వ్యతిరేక, రాజకీయ సాంఘిక ఉద్యమాలలో పనిచేసిన అప్పటి పురోగామి కమ్మ కులస్తుల సంఘటిత ఆకాంక్ష. దానికి తగ్గ ముఖచిత్ర ప్రతినిధిగా ఎన్.టి.ఆర్. ముందుకు రావడం వల్లనే ఆయన విజయం సునాయాసం అయింది తప్ప దాన్ని వ్యక్తి విజయంగానో దీన్ని వ్యక్తి పరాజయంగానో భావించడం పొరపాటు. భవిష్యత్తులో, వెనకబడ్డ వర్గాల రాజకీయ ప్రతినిధిగా ప్ర.రా.ప. విశ్వసనీయత సాధించ గలిగే అవకాశం ఎంత? వచ్చే ఎన్నికలవరకు ప్రరాప మనగలుగుతుందా అన్నదే ప్రస్తుత పరిస్థితుల్లో అస్పష్టంగా వుంది.
కె.సి.ఆర్. ఎన్నికల ఫలితాల తరువాత చేసిన క్లుప్తమైన ప్రసంగంలో ‘పోరాటం కొనసాగుతుంది’ అని చెప్పారు. తె.రా.స. ఓటమికి మాత్రమే కాక, కూటమి ఓటమికి కూడా కె.సి.ఆర్.కొంత కారణమని కూటమి నేతలు చెప్పిన విషయం సత్యదూరం కాదు. ఆయన నాయకుడిగా కొనసాగినంతకాలం పార్టీకి కానీ, ఆయన పోరాటంగా పేర్కుంటున్న వాదానికి కానీ విశ్వసనీయత పెరిగే అవకాశం లేదు. ఈ వాదానికి బలం చేకుర్చదలుచుకుంటే, అధ్యక్ష పదవికి – నిజంగా - రాజీనామ చేసి, మేనల్లుడినో, కోడుకునో మరో డమ్మీనో ఆస్థానంలో కూర్చోపెట్టక, యింటా బయట విశ్వసనీయత వున్న జయశంకర్ లాంటి ఉద్యమనేపథ్యం వున్న వ్యక్తికి పార్టి పగ్గాలు యివ్వడం ఉత్తమం. చాలామంది తెలంగాణా వాదులు, ముఖ్యంగా దేశం బయట వుండి తెలంగాణా కోసం తాపత్రయపడుతున్నామనుకునే వాళ్ళు, ఆయన వైఖరి లక్ష్యానికి ఆటంకం కలిగిస్తోందా లేదా అన్నది పక్కన పెట్టి, వాళ్ళు చేయలేని పని – ఆంధ్రావాళ్ళని బూతులు తిట్టడం – ఈయన చేయడం వల్ల చాలా ఆనందం పొందుతుండచ్చు. సంయమనంతో వాదం చేయగల వ్యక్తులు, ముఖ్యంగా రెండు రాష్ట్రాలుగా విడిపోవాలంటే దానికి అవసరమైన ఆర్ధికమైన (రెవెన్యూ, బడ్జట్) సర్దుబాట్లు విషయాలగురించి ఆలోచించగలిగే వ్యక్తులు రంగం మీదకి రాకుండా, ఈ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం.
రాష్ట్రంలో కాంగ్రెస్ కి కొంతైనా బయట సహాయం అవసరమైన బలహీన స్థితిలో ఉండి వుంటే బాగుండేది. యింకో ఐదు సంవత్సరాలు ఎవరూ అడ్డుకోలేరనే ధైర్యం వచ్చాకా, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే వుండడంతో, నక్సలైట్ల విషయంలో, నిబంధనల విషయంలో, తెలంగాణా విషయంలో రాజశేఖర రెడ్డి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలైన తీసుకోగలరు. ఆయన రాజకీయ ప్రత్యర్ధుల్ని ఎలాంటి అగచాట్లకైనా గురిచేయగలరు.
ఏమైనా ప్రజలు చాలా విజ్ఞతతో గొప్ప తీర్పు యిచ్చారు. హరీష్ రావుని గొప్ప మెజారిటితో గెలిపిచారు. కె.సి.ఆర్.ని ఓడిస్తామని భయపెట్టి గట్టెక్కించారు, రోజాని అసెంబ్లీకి రాకుండా చేసారు. ప్రరాపాని భంగపరిచారు. అల్లు అరవింద్ ఘోర పరాజయం మాత్రం నాకు పట్టలేనంత సంతోషం కలిగించింది - రాజనాల లాగా వికటాట్టహాసాలు చేయించింది. ఎంతైనా ప్రజల విజ్ఞతముందు మన అహంకారాలు, ఆ గుడ్డితనంతో మనం రచించే భవిష్యత్ చిత్రపటాలు నిలబడతాయా?
Tuesday, April 14, 2009
డార్క్ రూమ్ కలలూ, లైట్ రూమ్ 2.2
రంగంలో వున్న వెలుగు, నీడ, రంగులని పట్టి సరైన ఎక్సపోజర్ ఏమిటో నిర్ణయించడం ఒకప్పుడు చాలా జటిలమైన విషయం. దానిగురించి ‘జోన్ సిస్టమ్’ ఒకటి రూపొందింది. ఏన్సిల్ ఆడమ్స్ (Ansel Adams) నుంచి వందల మంది గొప్ప ఫొటొగ్రాఫర్లు - ముఖ్యంగా లాండ్ స్కేప్ ఫోటోగ్రాఫర్లు – వేల కొలది వ్యాసాలు ఆ విషయం మీద రాసారు. సాంకేతికంగా అనితరసాధ్యమైన ఫోటలు తీసిన ఏన్సిల్ ఆడమ్స్, స్పాట్ మీటర్ ఉపయోగించి రంగంలో పలు చోట్ల, వెలుగు, నీడ లని మీటర్ చేసి, దాని సగటుని లెక్కగట్టి, ఫొటో తీసేటప్పుడు వెలుగు సరిగ్గ రికార్డయ్యేలంటి ఎక్సపోజర్ ని కెమెరాలో పెట్టి, నెగెటివ్ డార్క్ రూమ్ లో డవలప్ చేసేటప్పుడు నీడలు సరిగ్గ వచ్చేలాగా డవలప్ చేసేలాగా సమయాన్ని పెంచి, దాన్ని ప్రింట్ చేసేప్పుడు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మాడ్చడం (Burn) లేద దాచడం (Dodge) లాంటి గమ్మత్తులు వుపయోగించి అద్భుతమైన ప్రింట్లు తయారు చేసాడు.
ఇమొజిన్ కన్నింఘమ్ (Imogen Cunningham) ఒక పోట్రయిట్ ఫోటో ప్రింట్ కి రాసుకున్న నోట్సు చూస్తే, బాంబు తయారుచేసే ఫార్ములా నోట్సు అంత క్లిష్టంగా కనిపిస్తుంది. ఆ నోట్సులో ఆమె, యిక్కడ యిన్ని సెకన్లు మాడ్చాలి, యిక్కడ యింత సేపు దాచాలి, దానికి వాడవలసిన రూపం యిది, అంటూ అతిచిన్న వివరంకూడా రాసారు. అద్భుతంగా కనపడే ఆ ఫోటోలు అలా రావడానికి ఫోటోగ్రాఫరు ఎన్నిగంటలు డార్కరూమ్ లో శ్రమపడాల్సి వచ్చేది ఆ నోట్స చూస్తే తెలుస్తుంది. సొంతంగా డెవలపింగ్, ప్రింటింగ్ చేసే ఫోటోగ్రాఫర్లకి ప్రక్రియలో అన్ని చోట్లా నియంత్రణ వుండేది. కలర్ ట్రాన్పరన్సీలు, నెగెటివ్ లు వచ్చాకా, డెవలప్ చేయడం, ప్రింట్ చేయడం చాలా సంక్లిష్టమవడమేకాక, దానికి కావలసిన పరికరాలు ఖరీదయినవి కావడంతో ఔత్సాహికంగా ఫోటోలో తీసే వాళ్ళు సొంతంగా డార్కరూమ్ వుంచుకోగలిగే అవకాశం తగ్గిపోయింది. కొంతమంది వృత్తి ఫోటోగ్రాఫర్లకి, ఔత్సాహికులకి ఒతనుగా ప్రింట్ చేసే స్టూడియోల వల్ల కొంత వరకు నియత్రణ / ప్రమేయం మిగిలినా చాలామందికి చివరిగా వచ్చే ఫలితం (ప్రింట్)లో నియంత్రణ తగ్గిపోయింది. డిజిటల్ వల్ల మళ్ళీ ఔత్సాహికులకి మంచిరోజులు వచ్చాయి.
వృత్తి ఫోటోగ్రాఫర్లు అనుసరించే డిజిటల్ పనివిధానం, ఫోటోలు తీసేప్పుడు ‘RAW’ ఫార్మేట్ లో తీసి, తరవాత డిజిటల్ డార్క్ రూమ్ లో ఆ నెగెటివ్ ని (RAW ఫోటోని) డెవలప్ చేసి, ప్రింట్ చేయడానికి అనువుగా చేయడం. యిలా చేయడం వల్ల చాలా లాభాలు వున్నాయి, పూర్వం ఫొటోగ్రాఫర్లకి డార్కరూమ్ లో ఏమేమి చేయడానికి అవకాశం వుండేదో అవన్నీ యిప్పుడు డిజిటల్ డార్కరూమ్ లో చేయగల ఆస్కారం వుంది. ఉదాహారణకి పోట్రయిట్ ఫోటోగ్రాఫర్లు తరచు చేసేపని, ఫోటోలో క్లారిటీని కొంత తగ్గించడం. దానివల్ల మొటిమలు, కళ్ళ చుట్టు వుండే చారలు లాంటివి దాదాపు అదృశ్యం అయిపోతాయి, అంతకంటే ముఖ్యంగా పలురకాల లైట్ సోర్స్ నుంచి వచ్చే వెలుగు వల్ల ఫోటోలో కనిపించే అసహజమైన రంగులని సరిచేయడం, లైట్ రూమ్ లాంటి డిజిటల్ డార్కరూమ్ లో చేయడం చాలా సులభం. క్రిందటి వారం, లైట్ రూమ్ లో డవలప్ చేసిన ఒక ఫోటో, పాత టపాలో వుంది, ఆసక్తి వుంటే తిరగేయచ్చు. డెవలప్ చేసిన సెట్టింగ్స్ కూడా అందులో వున్నాయి.
Wednesday, April 8, 2009
LR treatment
This is after the simple procedure -
I feel the after pic saturation and sharpening needs to be toned down a bit. The ND ending location needs to be tuned a bit. But it is definitely better than the before pic.
Here are the steps followed in develop mode for this change, in order –
- Crop and straighten.
- Set blacks.
- Set the whites.
- Recovery and fill light.
- Adjust mid tones – using tone curve.
o Use preset curves.
o Use clarity to define mid tones. - Set color.
o Set white balance.
o Vibrance and saturation. - Sharpen.
- Reduce noise.
- Chromatic Aberration correction.
- Edge burn using Vignette control.
- Local adjustment using graduated filter and Adjustment brush.
- HSL/ Color / Gray scale.
Thursday, February 26, 2009
స్లమ్ డాగూ- బాబీ జిందాలూ
మన జాతి వాడు, దేశం వాడు, కిందనించి వచ్చిన వాడు అమెరికాలో ఒక రాష్ర్టానికి గవర్నర్ అని గర్వపడాలా? రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాల్లో అన్నీ అభివృద్ధి నిరోధక భావాలే కల బాబీ జిందాల్, మన జాతి రాజకీయ నాయకత్వ విజయానికి ప్రతినిధి కనక సిగ్గుపడాలా? గుల్జార్, రెహమాన్, రెసూల్ లకి ఆస్కార్లు వచ్చాయని గంతులెయ్యాలా? అవి స్లమ్ డాగ్ కి అయినందుకు కించపడాలా?
షారుక్ ఖాన్ సినిమా డైలాగొకటుంది ‘కభీ కభీ కుచ్ జీత్ నికి లియే కుచ్ హార్నా పడ్తాహై, ఔర్ హార్ కర్ జీత్నే వాలేకో బాజీగర్ కెహెతే హై’. జూదంలో గెలవడమూ గెలవడమే. అందులో గెలుపుకైనా ప్రతిభా, అదృష్టం / కాలం కలిసి రావాలి. అన్నీ అమరినప్పుడు కూడా పడెయ్యాల్సిన ముక్క పడయ్యకుండా, కావల్సిన ముక్క తీసుకోలేం. ఒకోసారి పడేసినా తీసుకోలేం. ఇంకోసారి తీసుకున్నది పనికిరాకుండా పోవచ్చు. పారేసిందే తెచ్చుకున్నదానికన్నా విలువైనదని గ్రహించేసరేకే యింకోళ్ళు మన ఆట కట్టించేయచ్చు. అటన్నాకా గెలవడం ఓడడం రెండూ వుంటాయి. మనవాళ్ళు గెలిచినప్పుడు సంతోషపడాల్సిందే, కానీ గెలిచారు కనుక, జూదర్లని భుజాల కెక్కించుకోనక్కర్లేదు.
గాంధీ గోచి పెట్టుకుని రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు ఎవరూ ఆయన్ని మనదేశ దరిద్రాన్ని ప్రపంచానికి ప్రదర్శించి మనపరువు తీస్తున్నాడనలేదు. అప్పటి మన దారిద్ర్యానికి పరపలన కారణంగా చూపించ దలుచుకున్నం కనుక ఆయన వైఖరి బ్రిటిష్ పాలనలో మన దేశ ప్రజల దైన్యాన్ని ప్రపంచంముందు నిలబట్టిన సాహసంగానే కనబడింది. ఇప్పుడు స్లమ్ డాగ్ ని విమర్శించే వాళ్ళు కొందరైన లేవదిస్తున్న అభ్యంతరం ఆ సినిమా మన దరిద్రాన్ని ప్రపంచానికి చూపడం కాదు, మన దరిద్రాన్ని పరాయివాడు, పరాయివాళ్ళని ‘కదిలించడం’ కోసం చూపించడాన్ని. ఆ ప్రయత్నం ఎందుకోసం చేసారన్నదాన్ని. ‘అందమైన అబద్ధంలో కన్నా నిష్టురమైన నిజంలోనే మంచి కవిత్వం (కళ) దర్శనీయం అవుతుంది’ అన్న శ్రీశ్రీ మాటల్తో పూర్తిగా ఏకీభవించే వాళ్ళకూడా స్లమ్ డాగ్ ని యిష్టపడకపోవచ్చు. అందులో వున్న నిష్టురత నిజాన్ని చెప్పాలన్న ఆదర్శం వల్ల వచ్చింది కాదన్నది అందులో వున్న అందమైన అబద్ధాలని చూసే చెప్పచ్చు.
మనవాళ్ళకొచ్చిన ఆస్కార్లకైతే నాకు చాలా సంతోషం. కానీ స్లమ్ డాగ్ ని గొప్ప సినిమా అనో కనీసం పదికాలాలు గుర్తుండే సినిమా అనో అంగీకరించడానికి కూడా నాకైతే పరిమితులున్నాయి. ఒకసారి చూడడానికి కష్టపడాల్సన సినిమాని క్లాసిక్ గా ఆస్కార్ల వల్ల అంగీకరించేంత విశాల హృదయం నాకు లేదని ఒప్పేసుకుంటాను. అలాగే, ప్రధానంగా అమెరికా ప్రభుత్వం విధానాల లోపాల వల్ల ఏర్పడిన ఈ ఆర్ధిక సంక్షోభం మధ్యలో నిలబడి, సిద్ధంతపరమైన నమ్మకాలవల్లో, సొంతలాభం కోసమో ‘(ప్రభుత్వం ప్రమేయం లేకుండానే) అమెరికన్లు ఏమైనా చేయగలరు‘ అన్న బాబీ జిందాల్ ని నాయకుడి వేషంలో సహించనూలేను.
మాంద్యం వల్లేకాదు, ఈ పరిమితుల వల్లకూడా రెండు చప్పట్లు తప్ప, ఆర్భాటాలు అవసరంలేని ‘మన వాళ్ళ’ విజాయాలివి.
Thursday, February 12, 2009
“ఓ మహాత్మా! ఓ మహర్షి! ఏది నలుపు ఏది తెలుపు”
అతన్ని అరెస్టు చేయడానికి యింకో కారణ కూడా వుంది. అది, తన హోటల్లో కాగితాలు లేని నలుగులు - గంటమోల, హోండురస్, మెక్సికో దేశాలనుంచి వచ్చిన - వ్యక్తులని పనిలో పెట్టుకోవడం. వాళ్ళు ఈ దేశంలో చట్ట ప్రకారం వాళ్ళు పనిచేయకూడదని అతనికి తెలుసు. వారానికి ఆరురోజులు పనిచేసే వారని, వాళ్ళకి వసతి, తిండి యివ్వడంతో పాటు రెండు వారాలకి 600 చప్పున డబ్బు చెల్లించే వాడినని పోలీసుల దగ్గర అతనే ఒప్పుకున్నాడు. కొంత జరుమానా విధించి డిపోర్ట చేయడంతో సరిపెట్టాలనే కోరికతో నేరాల్ని స్వయంగా అంగీకరించేట్టు అతని న్యాయవాదులు సలహా యిచ్చినట్టు సమాచారం.ఈ విషయం విన్నప్పుడు ‘పాపం దురదృష్టవంతుడు’ అన్న భావనే కలిగింది కానీ అతను చట్టాన్ని అతిక్రమించాడననీ, నేరస్తుడనీ, శిక్షార్హుడనీ ప్రతికూల భావం ఏర్పడ లేదు నాలో. నేను ఈ విషయం కొంతమంది సహోద్యోగుల దగ్గర ప్రస్తావించాను. వాళ్ళు ఎవరూ కూడా ‘తగిన శాస్తి జరిగింది వాడికి’ అనలేదు. అందరూ విచారం వెలిబుచ్చిన వారే. కానీ, ఈ వార్త వచ్చిన పేపర్లో వార్తకింద 200 పైగా కామెంట్ లు వున్నాయి. దాదాపు అన్నీ ద్వేషపూరితమైన రాతలే.
ఈ మాదిరి కాగితాలు లేకుండా, తప్పుడు కాగితాలతో, వున్నవాళ్ళు అమెరికాలో కొన్ని లక్షలమంది వుంటారు. అలాంటి వాళ్ళందర్ని నేరస్తులుగా పరిగణించాలనీ, వేటాడి దేశం నుంచి బయటకు తోలాలన్నది ఒక పక్షం వాదం. అలా చేయడం వీలుకాని పని అనీ, అలాంటి వాళ్ళకి కొంత జరుమాన విధించి వాళ్ళు చట్టబద్దమైన పౌరులుగా మారగలిగే అవకాశం కలిగేలా చట్టాన్ని మార్చడం మానవీయమైన చర్య మాత్రమే కాక, దేశం ఆర్ధిక పురోగతికి కూడా అవసరం అన్నది యింకో పక్షంవాదం. గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది CIR (Comprehensive Immegration Reform) గురించి చర్చలు జరిగాయి కానీ, అది చట్టరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఆ మార్పులు జరిగే అవకాశం తక్కువే.
కొంచెం మంచి బతుకుకోసం సాహసం చేసి, చట్ట అతిక్రమణ చేసిన మనుషుల పట్ల ఇతరులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు అన్నది వారి వారి ప్రస్తుత జీవన పరిస్ధితుల మీద కూడా ఆధారపడి వుంటుంది. ఈ ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య లేకపోతే మెజారిటీ ప్రజలకి ఇలాంటి అతిక్రమణలు చేసిన మనుషుల పట్ల అంత ద్వేషం కలుగకపోవచ్చు. ఈ అనిశ్చిత స్పష్టమైన పరిష్కారం యింకా కనబడని నిరాశకరంగా వున్న ప్రస్తుత పరిస్థితి వల్ల పరదేశీయుల మీద ద్వేషం వల్ల జరిగే నేరాలు పెరిగే రోజులు రావనే భావిస్తాను.
ఈ అరెస్టు జరిగిన రోజే టైమ్స్ లో H1B మీద ప్రభుత్వం విధించిన పరిమితులని విమర్శిస్తూ, ఓపెన్ ఎడిటోరిల్లో ఫ్రైడ్ మాన్ “we need to attack this financial crisis with green cards not just greenbacks, and with start-ups not just bailouts.” అని రాయడం కాకతాళీయమే. అమెరికా నాయకులూ, ప్రజలూ ‘గోడల్ని బద్దల కొట్టకుండా’ ఈ సంక్షోభం పరిష్కారం కాదని తోందర్లోనే గ్రహిస్తారని ఆశిద్దాం.
Wednesday, February 4, 2009
ఓటమి - ఖలిల్ గిభ్రాన్
ఒటమి, నా ఒటమీ, నా ఏకాంతమా ముభావమా
ఒక వేయి దిగ్విజయాలకన్నా నువ్వేంటేనే నాకు ఎక్కువ ప్రితి
నువ్వే నా హృదయానికి ప్రాపంచికవైభవం కన్నా తీపి.
ఓటమి, నా ఓటమీ, నా ఆత్మజ్ఞానమా, నా ధిక్కారమా
నీ వల్లే తెలుసుకున్నాను నేను, నాదింకా యవ్వనమేననీ, వడిగల పాదలున్నయనీ
వాడిపోయే దండలలో చిక్కుకోకూడదనీ.
నీలోనే కనుక్కున్నాను ఒంటరితనాన్నీ
తిరస్కరించబడ్డంలో అలక్ష్యంకాబడ్డంలో వున్న హాయిని.
ఓటమి, నా ఓటమీ నా మెరిసే కత్తీ డాలూ
నీ కళ్ళల్లోనే చదువుకున్నాను నేను
పట్టం కట్టించుకోవడమంటే బానిసవ్వడమే అని
అర్ధంఅవడం అంటే కుదించబడ్డం అని
గ్రహించబడ్డం అంటే ఒకడు పూర్ణత్వాన్ని చేరి
నిండా పండిన ఫలంలా నేలరాలి భక్ష్యమవ్వడం అనీ.
ఓటమి, నా ఓటమీ, నా ధైర్యమైన సహచరి
నువ్వు నా పాటలూ నా ఏడుపులూ నా నిశ్శబ్దాలూ వినాలి
నువ్వు మాత్రమే చెప్పాలి నాకు రెక్కలు రెపరెపల గురించీ
ఉత్ర్పేరేసిస్తున్న సముద్రాలగురించీ,
రాత్రి మండే కొండలగురించీ
నువ్వు మాత్రమే నిటారుగా రాళ్ళు నిండిన నా హృదయారోహణ చేయగలవు.
ఓటమి, నా ఓటమీ, నా నిర్గమించని సాహసమా
నువ్వు నేను తుఫానుతో కలసి కేరింతలు కొడదాం
అలాగే మనిద్దరం కలిసి మనలో చస్తున్న అన్నింటికీ సామాధి కడదాం
మనం ఎండలో సంకల్పంతో నిలబడదాం
మనం ప్రమాదకరమౌదాం.
*******
ఆంగ్ల మూలం ఇది -
Defeat
Gibran Khalil
Defeat, my Defeat, my solitude and my aloofness;
You are dearer to me than a thousand triumphs,
And sweeter to my heart than all worldglory.
Defeat, my Defeat, my self-knowledge and my defiance,
Through you I know that I am yet young and swift of foot
And not to be trapped by withering laurels.
And in you I have found aloneness
And the joy of being shunned and scorned.
Defeat, my Defeat, my shining sword and shield,
In your eyes I have read
That to be enthroned is to be enslaved,
And to be understood is to be levelled down,
And to be grasped is but to reach one's fullness
And like a ripe fruit to fall and be consumed.
Defeat, my Defeat, my bold companion,
You shall hear my songs and my cries and my silences,
And none but you shall speak to me of the beating of wings,
And urging of seas,
And of mountains that burn in the night,
And you alone shall climb my steep and rocky soul.
Defeat, my Defeat, my deathless courage,
You and I shall laugh together with the storm,
And together we shall dig graves for all that die in us,
And we shall stand in the sun with a will,
And we shall be dangerous.
Sunday, January 25, 2009
అమెరికాలో తెలుగువాళ్ళు సంతానానికి తెలుగు నేర్పడం, కొన్ని ప్రశ్నలు
మొదటిగా ఈ కార్యక్రమాలు చూసిన తరువాత, అందులో పాలు పంచుకున్న పిల్లల తెలుగు భాషా శక్తి చూసాకా, యింకా ఆ బడికి పిల్లలు పంపని వాళ్ళకి తమ పిల్లల్ని బడిలో చేర్చాలని అనిపిస్తుందా? అన్నది. తమ పిల్లల్ని రంగం మీద చూసుకోవడం, ప్రేక్షకుల్ని బతిమాలి, మోహమాటపెట్టీ ఆ రచ్చకి చప్పట్లు కొట్టంచడం; యివే ధ్యేయం అయితే వెంటనే ఆ బడిలో చేర్చాలనే అనిపించచ్చు. పిల్లలకి తెలుగురావడం వుద్దేశ్యమైతే యిలాంటి బల ప్రదర్శనాలు ఏమీ ఉత్తేజ పరచవు. నా పక్కన వున్నాయన్ని అదే అడిగాను.. 'మన పిల్లల ఉచ్ఛారణ యింత ఘోరంగా అఘోరించలేదే, యిందులో వాళ్ళు ఎందుకిలా వున్నారు' అని. దానికి ఆయనన్నాడు, 'మన వాళ్ళు యింకా బడికి (మామూలు బడి) వెళ్ళడం మొదలు పెట్టలేదు కనుక సవ్యమైన తెలుగే మాట్లాడుతున్నారు' అని. బహుశా అదే కావచ్చు. పిల్లలు మాములు బడికి వెళ్ళడం మొదలు పెట్టాకా, యింట్లో తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం లాంటివి క్రమంగా జరిగే వాతావరణం లేకపోతే ఆ అభ్యాసం పోతుంది. తెలుగు నేర్పడం కోసం వున్నవి స్వచ్ఛంద సేవకులు నడిపే సంస్థలు కనుక, వాటికి వున్న ఒనరులు, సమయం చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది సమయంలో చాలా భాగాం ఏడాదికి రెండు మూడు సార్లు జరగాల్సిన ఈ మొక్కుబడి కార్యక్రమాల నిర్వహణకే గడిచిపోతుంది. మరి బడి అసలు ఆదర్శం గతి?
ఈ కార్యక్రమంలోనే కాదు, చాల మటుకు యిటువంటి కార్యక్రమాల్లో ఎన్.ఆర్.ఐ నిర్వాహకులు తరచూ ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టండోయో అని బతిమాలే సందర్భాల్లో చెప్పేది - 'మేం (లేదా వాళ్ళు) - ఈ కార్యక్రమం కోసం - చాలా కష్ట పడ్డం, మీ అభినందన చూపండి' అని అడగడం. ఈ కార్యక్రమంలో ఆ మాట విని విని విసుగువచ్చి ఒక సారైతే లేచి నిలబడి 'మరీ అంత కష్టపడి మమ్మల్ని కష్టపెడ్డడం ఎందుకయ్యా, కష్టపడకు' అని అరవాలనిపించిది. మన పిల్లలకి, మన భాష మనం నేర్పడం వాళ్ళు వారానికి ఒక అరగంట టి.వి చూడకుండా - పోని wii దగ్గర ఎంజయ్ చేసేయడం త్యాగం చేసేసి - బడికి వచ్చి ఏదో నేర్చుకునే ప్రయత్నం చేయడంలో కష్టం ఒక్కటే కనిపిస్తుంటే, ఎందుకు చేయడం? ఈ ప్రయత్నంలో నేర్పేవాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి ప్రయోజనకరమైన పని చేస్తున్నమనే ఆత్మసంతృప్తి, కించత్ గర్వం కలగనప్పుడు, ఎందుకు చేయడం?
ఒక ప్రయోజనం కోసం పని చేసే వాళ్ళు చిన్న పనులని చాలా కష్టంతో సాధించామనుకోరు. ఇంకోలా చెప్పాలంటే, చిన్న పనులనే మహాకష్టమైన పనులనుకునేవాళ్ళు, పెద్ద పనులేం సాధించలేరు. అవును, మొహమాటం లేకుండా అంటాను, పిల్లలకి నాలుగు తెలుగు అక్షరాలు నేర్పడమో, నాలుగు పద్యాలు నేర్పడమో, చాలా చాలా చిన్న పనులు; వాటికి చప్పట్లు కావాలని దేబురించడంతోనే ఆగిపోతే అవి అప్రయోజనమైన పనులు కూడా.
ఈ సందర్భంలో 'కష్టం' అని మాట వాడడంలో ధ్వని 'అవసరం లేని' పని చేయడం అనా అన్నది నా అనుమానం. తెలుగు నేర్చుకోవడం ఎందుకు? ఏ భాషైనా నేర్చుకోవడం ఎందుకు? ఒక కారణం ఆ భాషలో వున్న సాహిత్యాన్ని అనుభవించడానికి. మన భాషని, అందులో వున్నా అపారమైన అమూల్యమైన కవిత్వాన్ని, కథల్ని, మనవి మాత్రమే అయిన విశేషాలని నేర్చుకోవడం, నేర్చుకున్నది పిల్లలతో పంచుకోవడం అనే వుద్దేశ్యంతో నడవలసిన సంస్థలు మొక్కుబడి కార్యక్రమాలకోసం, పిల్లల్ని స్టేజ్ ఎక్కించడంకోసం, చప్పట్ల కోసం శక్తి ఖర్చుపెట్టడం మానేయడం ఉత్తమం. దాని బదులు, ఒక డెడ్ లైన్ పెట్టుకుని కాక, అన్నీ కలసివచ్చినప్పుడే నిజంగా పిల్లల్ని, ప్రేక్షకుల్ని ఉత్తేజపరచగలిగేలాంటి సభ జన్మానికి ఒకటి నడిపినా, అదే మేలు.
- రమణ.
Tuesday, January 20, 2009
ఒబామా ప్రమాణ స్వీకారం
http://www.nytimes.com/2009/01/20/us/politics/20text-obama.html
ఈ మాటలు అన్నది నెహ్రూనో, సోషలిస్టులో కాదు, ఈవాళ ప్రమాణ స్వీకారం సందర్భంలో ఒబమా యిచ్చిన చారిత్రాతమ్మకమైన వుపన్యాసంలో అన్న మాటలు.
గవర్నమెంటు ఖర్చు పెంచబోతోందని, టాక్సలు పెరగచ్చని, బుష్ టైమ్ లో పెరిగిన నమ్మకం ఆధారిత చొరవలు (faith based initiatives) కి గడ్డుకాలం రాబోతోందని, పాకిస్తానుకి కొన్ని వార్నింగుల యిస్తారని లైన్లమధ్య చదువచ్చు.
Monday, January 12, 2009
Sunny f16 = Moon light f8
ISO 100 - Manual mode - f8 @ 1/100 - Focal length 300 with 75-300.
This is the wide shot at the same time, from same spot.
Monday, January 5, 2009
Couple of shots made with Canon 50 mm 1.8
ISO: 400, 1.8 @ 1/800, light source was 2'*3' softbox with hot light. Notice how the image started becoming soft from right eye onwards, it is due to the wide aperture. I could have added some sharpening, but did not make any PP changes as I want to show you the results as is out of camera with 50 mm.